అధికారులపై విచారణ.. లేదంటే సీఎండీలు, చైర్మన్లపై వేటు | Supreme Court Cracks Down on HDFC ICICI Bank Subvention Loan Fraud | Sakshi
Sakshi News home page

అధికారులపై విచారణ.. లేదంటే సీఎండీలు, చైర్మన్లు కోర్టుకు రావాల్సిందే!

Nov 26 2026 6:19 PM | Updated on Nov 26 2026 6:35 PM

Supreme Court Cracks Down on HDFC ICICI Bank Subvention Loan Fraud

రియల్‌ ఎస్టేట్‌ సబ్‌వెన్షన్‌ పథకాల పేరిట గృహ కొనుగోలుదారులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన వ్యవహారంలో సుప్రీంకోర్టు అత్యంత కఠిన వైఖరిని ప్రదర్శించింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న అధికారులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ కొనసాగించేందుకు వారంలోగా అనుమతులు మంజూరు చేయాలని నాలుగు ప్రముఖ ఆర్థిక సంస్థలను ధర్మాసనం ఆదేశించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు సమ్మాన్‌ క్యాపిటల్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు ఈ మేరకు స్పష్టమైన గడువు విధించింది. ఆదేశాల అమలులో జాప్యం జరిగితే ఆయా సంస్థల చైర్మన్లు, సీఎండీలు వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.

పథకం వెనుక అసలు మోసం

సబ్‌వెన్షన్‌ ఒప్పందం ప్రకారం కొనుగోలుదారు, బిల్డర్‌, బ్యాంకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరుగుతుంది. ఫ్లాట్‌ అప్పగించే వరకు రుణ వాయిదాలను (ఈఎంఐ) బిల్డరే చెల్లించాల్సి ఉండగా బ్యాంకులు రుణ మొత్తాన్ని నేరుగా బిల్డర్లకు విడుదల చేశాయి. అయితే, నిర్మాణాలు పూర్తికాకుండానే బిల్డర్లు చేతులెత్తేయడంతో ఈఎంఐల భారం కొనుగోలుదారులపై పడింది. ఫ్లాట్లు చేతికి రాకపోగా బ్యాంకుల రికవరీ వేధింపులకు గురవుతున్న బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘హిమాంశు సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు, 2025 ఏప్రిల్‌ 29న ఇచ్చిన ఉత్తర్వుల్లో బిల్డర్లు-బ్యాంకుల మధ్య కుమ్మక్కుపై ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

దర్యాప్తు పురోగతి - సెక్షన్‌ 19 అడ్డంకి

తాజా విచారణలో సీబీఐ తన నివేదికను సమర్పించింది. మొత్తం 55 కేసుల్లో 25 కేసుల దర్యాప్తు పూర్తయిందని, 22 కేసుల్లో ఛార్జ్‌షీట్లు దాఖలు చేశామని సీబీఐ వెల్లడించింది. అయితే, అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్‌ 19 ప్రకారం అధికారుల విచారణకు అవసరమైన అనుమతులు ఇవ్వడంలో బ్యాంకులు జాప్యం చేస్తున్నాయని, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం ఎలాంటి షరతులు లేకుండా వారం రోజుల్లో అనుమతులివ్వాలని ఆదేశించింది. ఛార్జ్‌షీట్లు దాఖలైన కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని సంబంధిత కోర్టులకు సూచించింది. దర్యాప్తు, తదుపరి న్యాయ విచారణ ప్రక్రియ పూర్తయితేనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల బాధ్యతపై తుది నిర్ధారణ వెలువడనుంది.

ఇదీ చదవండి: మాటలతో తేలేలాలేదు.. టీవీఎస్‌ ఆస్తులపై హైకోర్టులో దావా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement