breaking news
cracks down
-
బిహార్‌లో కూలిన తీగల వంతెన
పట్నా: రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భారీ తీగల వంతెన కూలిపోయింది. బిహార్ రాష్ట్రం భాగల్పూర్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నిర్మాణంలో ఈ వారధి తొలుత రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నేలకూలాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గంగా నదిపై ఖగారియా.. అగువానీ, సుల్తాన్‌గంజ్ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కొంత భాగం కూలిపోవడంతో పునర్నిర్మించారు. రెండు నెలల క్రితం బలమైన ఈదురు గాలుల ధాటికి పగుళ్లు వచ్చాయి. ఆదివారం నేలకూలింది. దాదాపు ఐదు స్తంభాలు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేత విజయ్‌కుమార్ సిన్హా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పనిలోనూ కమిషన్లు తీసుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయిందని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన ఆగిపోయిందని, ఆరాచకం, అవినీతి పెచ్చరిల్లిపోతున్నాయని ఆరోపించారు. ఇక్కడ వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతుంటే సీఎం నితీశ్ విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
Joshimath: కుంగుతున్నా వదలట్లేదు
డెహ్రాడూన్: భూమి కుంగిపోతున్నా సొంతింటిని, స్వస్థలాలను వదిలి వెళ్లేందుకు జోషీమఠ్ వాసులు ససేమిరా అంటున్నారు. ఖాళీ చేయాలంటూ ఇప్పటికే దాదాపు 200కుపైగా ఇళ్లకు అధికారులు ఎరుపు రంగు పూశారు. వెంటనే సురక్షిత శిబిరాలకు లేదా అద్దె భవనాలకు తరలిపోవాలని, ఒక్కో కుటుంబానికి నెలకు రూ.4,000 చొప్పున ఆరునెలలపాటు ఆర్థికసాయం అందిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం మరో 68 ఇళ్లకు పగుళ్లు పడ్డాయి. దీంతో కుంగిన, దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 678కి పెరిగింది. అయినా పలువురు ఇళ్లు వీడటం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధూ సోమవారం ఆందోళన వ్యక్తంచేశారు. ‘ ప్రతి నిమిషమూ అత్యంత ప్రధానం. వెంటనే ఇళ్లను వీడండి’’ అని కోరారు. ‘‘ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలు ఇప్పటికే జోషిమఠ్‌లో సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. భూమి కుంగడంతో పగిలిన తాగు నీటి సరఫరా పైపులను పునరుద్దరించాలి. లేదంటే పెద్దమొత్తంలో నీరు దిగువ భూముల్లో ఇంకి త్వరగా మరింతగా కుంగే ప్రమాదం పెరుగుతుంది’’ అని ఆయన అన్నారు. కాగా, ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్చేసింది. కుటుంబానికి రూ.5,000 చాలా తక్కువ మొత్తమని, సర్వస్వం కోల్పోతున్న ఒక్కో బాధితునికి రూ.50వేలు ఇవ్వాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అభిప్రాయపడ్డారు. -
ప్రయివేట్ ఆసుపత్రులపై కొరడా..భారీ జరిమానా
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) అతి తక్కువ ధరలకే వైద్యం అందిస్తామని చెప్పి, నిబంధనలను ఉల్లంఘించిన పలు ప్రయివేటు ఆసుపత్రులపై కేజ్రీవాల్ సర్కార్ కొరడా ఝళిపించింది. ఆర్థికంగా బలహీనమైన సెక్షన్ల రోగులకు చికిత్సను అందించడంలో విఫలమైనందుకు భారీ జరిమానాను విధించింది. పేదలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించాలన్న నిబంధనకు అంగీకరించి, తక్కువ ధరలకు విలువైన స్థలాలను పొంది, అనంతరం ఆ నిబంధనను తుంగలో తొక్కిన నగరంలోని పలు ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎలాట్ మెంట్ అగ్రిమెంట్ ప్రకారం పేదలకు సేవలు అందించడానికి బదులు, కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఐదు ఆసుపత్రులపై భారీ జరిమానా విధించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్, మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకంద్ హాస్పిటల్, ధర్మషీలా క్యాన్సర్ హాస్పిటల్, పుష్పవతి సింఘానియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లపై రూ.600 కోట్ల జరిమానా విధించింది. మొత్తం 43 కంపెనీలకు ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తూ, వాటిల్లో పేదలకు చౌకగా వైద్యం అందించాలన్న నిబంధన విధించామని, నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. జరిమానాను జులై 9వ తేదీలోగా చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లేదంటే కఠిన చర్యలకు దిగుతామని ఢిల్లీ ప్రభుత్వ అదనపు డైరెక్టర్ (ఈడబ్ల్యుఎస్) డాక్టర్ హేమ్ ప్రకాష్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ప్రయివేటు ఆసుపత్రులు లీజ్ ఎగ్రిమెంట్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయంటూ అశోక్ అగర్వాల్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు నవంబర్ 15, 2002 లో నవంబర్ లో కోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించాలని పేర్కొంది. అయినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో 2007లో దీనిపై ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు ఢిల్లీ ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. తాము కోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని ఢిల్లీ హెల్త్ సెక్రటరీ డా.తరుణ సీమ్ తెలిపారు. కొన్ని ఆస్పత్రులు నిబంధనల పూర్తి ఉల్లంఘన చేస్తున్నట్టు తేలిందనీ, తమ నివేదికను కోర్టుకు సమర్పించామని కమిటీ సభ్యుడు కూడా అయిన అగర్వాల్ చెప్పారు. 40 ఆస్పత్రుల అకౌంట్లను పరిశీలించామని,ఆయా యాజమాన్యాల అభ్యంతరాలు పరిశీలించిన మీదట తుది నోటీసులు జారీ అయ్యాయన్నారు. అసమంజసమైన లాభాలను ఆర్జిస్తూ , పేదల వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని తేలిందని చెప్పారు. ఇది అన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు ఒక హెచ్చరిక లాంటిదని అగర్వాల్ అన్నారు. అయితే ఈ ఆదేశాలపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ అనుబంధ సంస్థ ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఇనిస్టిట్యూట్, ధర్మషీలా క్యాన్స్ ర్ ఇనిస్టిట్యూట్ స్పందించాయి. 503 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా తమకు నోటీసులందాయని దీన్నిఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు ఫోర్టిస్ తెలిపింది. ఇది అన్యాయమని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ధర్మషీలా హాస్పిటల్ అధ్యక్షుడు డా. సువర్ష ఖన్నాచెప్పారు. తాము 25 శాతం ఔట్ పేషెంట్ రోగులకు, 10 శాతం సబ్సిడీతో ఇన్-పేషంట్ విభాగాల్లో సేవలు అందిస్తున్నామని వాదించాయి. దీంతో పాటుగా అనేక ఇతర రోగులకు సబ్సిడీపై సేవలు అందిస్తున్నామని డాక్టర్ ఖన్నా తెలిపారు.