
బెంగళూరుకు చెందిన బై-నౌ-పే-లేటర్ (BNPL) సంస్థ సింపుల్ (Simpl) తక్షణమే తన చెల్లింపు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆర్బీఐ (RBI)ఆదేశించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ సంస్థ సుమారు 26,000 మంది వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుని ‘బై-నౌ-పే-లేటర్’ పేరుతో రుణ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 ప్రకారం, స్పష్టమైన అనుమతి లేకుండా ఏ కంపెనీ కూడా అటువంటి వ్యవస్థను ఆపరేట్ చేయడానికి వీల్లేదని ఆర్బీఐ చెబుతోంది.
డిజిటల్ క్రెడిట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ‘బై-నౌ-పే-లేటర్’ స్కీములు ఇటీవల బాగా విస్తరించాయి. తక్షణ క్రెడిట్ లైన్లతో వినియోగదారులను, వ్యాపారులను ఈ సంస్థలు ఆకర్షిస్తున్నాయి. అసురక్షిత రుణాలు, బలహీనమైన పర్యవేక్షణ, పేలవమైన వినియోగదారుల రక్షణ వంటి ఆందోళనలతో ఆర్బీఐ 2022లోనే బీఎన్‌పీఎల్ సంస్థలను అప్పు తీసుకున్న డబ్బుతో ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలను టాప్ అప్ చేయకుండా నిలిపివేసింది.
వన్ సిగ్మా టెక్నాలజీస్ నిర్వహిస్తున్న సింపుల్ గతంలో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), విదేశీ మారక నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి వచ్చింది. 100 శాతం ఆటోమేటిక్ ఎఫ్డీఐ ఆమోదానికి అర్హత కలిగిన ఐటీ సర్వీసెస్ గా తన వ్యాపారాన్ని వర్గీకరించడం ద్వారా కంపెనీకి రూ .913 కోట్లు తెచ్చుకుందన్న ఆరోపణలు ఉన్నాయి.