ఇన్సూరెన్స్‌పై పెరుగుతున్న అవగాహన
యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ సుమిత్ మదన్
జీవిత బీమాపై జీఎస్‌టీని తొలగించిన నేపథ్యంలో పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుమీత్ మదన్ తెలిపారు. సెప్టెంబర్ 22 (మార్పులు అమల్లోకి వచ్చిన రోజు) తర్వాత నుంచి, దీపావళి రెండు మూడు రోజులు మినహాయిస్తే, వారం వారీగా 30–35 శాతం విక్రయాల వృద్ధి కనిపించిందని ఆయన పేర్కొన్నారు.
కోవిడ్ అనంతరం బీమాపై అవగాహన, పాలసీల కొనుగోళ్లు పెరిగాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి సుమిత్ చెప్పారు. క్లెయిమ్ సెటిల్మెంట్లు మెరుగ్గా ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని తెలిపారు. మరోవైపు, జెనరేషన్ జెడ్ కూడా బీమాపై ఆసక్తి చూపుతోందని వివరించారు. సౌకర్యవంతంగా డిజిటల్ మాధ్యమంతో పాటు సంప్రదాయ బ్యాంకెష్యూరెన్స్ మాధ్యమం ద్వారా కూడా కొనుగోళ్లు చేస్తోందని పేర్కొన్నారు. అయితే, పరిశ్రమ నిర్వహిస్తున్న ప్రచార కార్కక్రమాలు, ఇతరత్రా కారణాలతో కూడా బీమాపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, అది ఆచరణలో (పూర్తి స్థాయిలో పాలసీల కొనుగోళ్ల రూపంలో) కనిపించేందుకు మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
తగినంత కవరేజీ కూడా ముఖ్యం..
బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, తగినంత కవరేజీ తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని సుమిత్ చెప్పారు. చాలా మంది దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని వివరించారు. పరిస్థితులను బట్టి వార్షికాదాయానికి పది నుంచి పదిహేను రెట్లు కవరేజీ ఉండటం శ్రేయస్కరమని పేర్కొన్నారు. పాలసీదారులకు మరింత చేరువయ్యే క్రమంలో తమ ప్రక్రియల్లో కృత్రిమ మేథ (ఏఐ)ని కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థకు సంబంధించి దాదాపు 64 శాతం అండర్‌రైటింగ్ ఏఐతోనే జరుగుతోందని సుమిత్ వివరించారు. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడమనేది బీమా రంగానికి ప్రయోజనకరమేనని ఆయన చెప్పారు. దీనితో పోటీ పెరిగి, అంతిమంగా కస్టమర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం


