అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రజల జీవన విధానం కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగాలవైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారికి పదవీ విరమణ తర్వాత జీవితం.. సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం. వయసు పెరిగేకొద్దీ.. వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మనం ఈ కథనంలో పదవీ విరమణ ప్రణాళికలో జీవిత బీమా ఎందుకు ముఖ్యమో చూసేద్దాం.
పదవీ విరమణ తర్వాత ఆదాయం
ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పదవీ విరమణ చేస్తే జీతం ఆగిపోతుంది. అలాంటి సమయంలో.. ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం అవసరం. కొన్ని జీవిత బీమా పథకాలు పదవీ విరమణ తర్వాత నెలవారీ లేదా వార్షిక ఆదాయం అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీలు, ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లు వంటి అనేక ప్రణాళికలు ఒకేసారి మొత్తం ఇవ్వడం కాకుండా.. నిరంతర ఆదాయం అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడుతుంది.
వైద్య ఖర్చులు
వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గుతుంది. ఖర్చుల గురించి ఆందోళన లేకుండా మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది.
అప్పులు తీర్చేందుకు
కొన్ని సందర్భాల్లో హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్లు పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి అప్పులు వృద్ధాప్యంలో తప్పకుండా భారం అవుతాయి. జీవిత బీమా పాలసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన అప్పులను తీర్చేయవచ్చు. దీంతో అప్పుల ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.
ఖర్చుల నుంచి రక్షణ
కాలక్రమంలో ఖర్చులు పెరగవచ్చు. దీనికోసం డబ్బు దాచుకుంటే సరిపోదు. డబ్బును పెంచుకునే మార్గాలు ఉండేలా చూడాలి. దీనికోసం ULIPల వంటి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పథకాలు. పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వృద్ధి పొందుతాయి.
తక్షణ నగదు లభ్యత
భూములు, ఇళ్లు వంటి స్థిర ఆస్తులను అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. కానీ జీవిత బీమా నుంచి వచ్చే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. అంతే కాకుండా.. ఈ మొత్తంపై ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబానికి అవసరమైన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి: సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..


