ఇక ‘అక్కా కేఫ్‌’లు.. ఎక్కడంటే.. | Karnataka Govt Announces Akka Cafes With ₹25 Crore Allocation To Empower Women Entrepreneurs, Know All About Akka Cafes | Sakshi
Sakshi News home page

Akka Cafes Details: ఇక ‘అక్కా కేఫ్‌’లు.. ఎక్కడంటే..

Feb 13 2026 5:08 PM | Updated on Feb 13 2026 5:23 PM

Karnataka Government Announces Akka Cafes All About The Initiative

కర్ణాటక రాష్ట్రంలో ఇక మరిన్ని ‘అక్కా కేఫ్‌’లు ప్రారంభం కానున్నాయి. 2025లో ప్రారంభించి స్వయం సహాయక బృందాల (SHGs) మహిళల ద్వారా నిర్వహిస్తున్న కాఫీ వ్యవస్థాపకత కార్యక్రమం ‘అక్కా కేఫ్’ చొరవను విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. 16వ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రాజెక్టును ప్రకటించారు.

బెంగళూరులో తాజాగా జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్ర కాఫీ వ్యాల్యూ చెయిన్‌నుబలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఏమిటీ  ‘అక్కా కేఫ్’?
‘అక్కా కేఫ్’ ప్రోగ్రామ్ అనేది జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న జీవనోపాధి, వ్యవస్థాపకత పథకం. ఇది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, జీవనోపాధి విభాగం ద్వారా అమలవుతోంది.

ఈ చొరవ ద్వారా కర్ణాటక అంతటా మహిళలు నడిపే కాఫీ కియోస్కులు, కేఫ్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయడం లక్ష్యం. స్వయం సహాయక సంఘాల మహిళలు మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇది తోడ్పడుతుంది.

కర్ణాటక ప్రభుత్వ తాజాగా ప్రకటించిన రూ.25 కోట్ల కేటాయింపుతో  కియోస్క్ మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్‌కు సహకారం అందించనున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద 2,500 ‘అక్కా కేఫ్’ కాఫీ కియోస్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కియోస్క్‌ల రూపకల్పన, సరఫరా, నిర్మాణం, ప్రారంభానికి టెండర్లు ఇప్పటికే పిలిచినట్లు సమాచారం.

దశలవారీ అమలు
ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. మొదటి దశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 50 ఆధునిక కేఫ్‌లు ఏర్పాటు చేస్తారు. అర్హులైన మహిళలకు మౌలిక సదుపాయాలు, సెటప్ కోసం రూ.15 లక్షల వరకు గ్రాంట్లు అందించనున్నారు.

ఎక్కడెక్కడ?
ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ‘అక్కా కేఫ్’లు పనిచేస్తున్నాయి. వీటిలో బెంగళూరులో రెండు, బీదర్‌లో రెండు, కార్వార్‌లో ఒకటి ఉన్నాయి. త్వరలో మైసూరులో మరో రెండు కేఫ్‌లు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులోని గాంధీనగర్, దేవనహళ్లి ప్రాంతాలలో అక్కా కేఫ్‌లను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు.

మెనూలో ఏమేముంటాయంటే..
‘అక్కా కేఫ్’ల్లో ప్రధానంగా కాఫీ లభిస్తుంది.  అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మెనూలో సాధారణంగా కాఫీతోపాటు ఇడ్లీ, వడ, ఉప్మా, పులావ్, టీ ఉంటాయి. చౌకైన ధరల్లో అల్పాహారం, తేలికపాటి భోజనం కూడా లభిస్తాయి.

లక్ష మంది మహిళలకు శిక్షణ
కాఫీ బోర్డు ఆఫ్ ఇండియా, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ సహకారంతో లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణలో ప్రధానంగా ప్రామాణిక ఫిల్టర్ కాఫీ తయారీ, కేఫ్, కియోస్క్ నిర్వహణ, వ్యవస్థాపకత, సూక్ష్మ ఎంటర్ప్రైజ్ అభివృద్ధి వంటి అంశాలు ఉంటాయి.

తొలుత సుమారు 400 మంది మహిళలకు బెంగళూరులోని కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షకులు తాలూకా, గ్రామ స్థాయిలలో మిగిలిన మహిళలకు శిక్షణ అందిస్తారు. శిక్షణ , అమలుకు కాఫీ బోర్డు అటల్ ఇంక్యుబేషన్ & ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ సెంటర్ సహకారం అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement