విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సేవలు అందించే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విదేశీ విశ్వవిద్యాలయాలకు అందించే కన్సల్టెన్సీ సేవలను ‘సేవల ఎగుమతి’(Export of Services) గానే పరిగణించాలని, వాటికి జీఎస్టీ రీఫండ్ పొందే హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనితో జీఎస్టీ చట్టంలోని ‘ఇంటర్మీడియరీ’ (మధ్యవర్తిత్వ) సేవలపై చాలా కాలంగా కొనసాగుతున్న న్యాయపరమైన సందిగ్ధతకు తెరపడింది.
హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
జస్టిస్ జేబీ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. గ్లోబల్ అపర్చునిటీస్ అనే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థకు జీఎస్టీ రీఫండ్ మంజూరు చేయాలని గత ఏడాది సెప్టెంబర్‌లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.
కోర్టు తీర్పులో అంశాలు..
‘విదేశీ వర్సిటీలకు అందించే సేవలు స్వతంత్రమైనవి. వీటిని కేవలం మధ్యవర్తిత్వ సేవలుగా చూడలేం. విద్యార్థులు భారత్‌లో ఉన్నారనో లేదా పారితోషికం విదేశీ కరెన్సీలో వస్తుందనే కారణాలతో ఈ సేవలను 'ఇంటర్మీడియరీ సేవలు'గా పరిగణించడం సాధ్యం కాదు. విద్యార్థులు వర్సిటీల్లో చేరిన తర్వాతే కమిషన్ అందవచ్చు, కానీ అది సంస్థ అందించే సేవల ఎగుమతి స్వభావాన్ని మార్చదు’ అని న్యాయస్థానం పేర్కొంది.
ఐజీఎస్‌టీ చట్టంపై స్పష్టత
ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (IGST) చట్టంలోని సెక్షన్ 2(13) ప్రకారం 'ఇంటర్మీడియరీ' నిర్వచనాన్ని ఈ కేసులో లోతుగా విశ్లేషించారు. సదరు కన్సల్టెన్సీ కేవలం విద్యార్థులకు, వర్సిటీలకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరించడం లేదని, అది ఒక స్వతంత్ర సేవగా పరిగణించబడుతుందని దిల్లీ హైకోర్టు ఇదివరకే తేల్చింది. ప్రభుత్వం దీన్ని ఏజెంట్ సేవగా అభివర్ణించినప్పటికీ సుప్రీంకోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఈ తీర్పు ప్రభావం కేవలం ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలకే పరిమితం కాకుండా విదేశాలకు సేవలు ఎగుమతి చేసే ఇతర రంగాలపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది. కొన్ని సంస్థలకు నిలిచిపోయిన కోట్లాది రూపాయల జీఎస్టీ రీఫండ్‌లు విడుదల కావడానికి ఇది మార్గం సుగమం చేసింది.
ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు


