దగ్గరపడుతున్న డెడ్‌లైన్.. పన్ను చెల్లింపులపై కీలక సూచనలు! | March Financial Deadline 2026 Know The Tax Tasks You Must Complete | Sakshi
Sakshi News home page

దగ్గరపడుతున్న డెడ్‌లైన్.. పన్ను చెల్లింపులపై కీలక సూచనలు!

Mar 9 2026 9:15 AM | Updated on Mar 9 2026 10:44 AM

March Financial Deadline 2026 Know The Tax Tasks You Must Complete

ఆర్ధిక సంవత్సరంలో మార్చి నెల అత్యంత క్లిష్టం.. అత్యంత కీలకం. అలాంటిదే ఈ 2026 మార్చి కూడా. వ్యక్తులుగా మీ ఇన్‌కంట్యాక్స్‌ వ్యవహారాల్లో మీరు చేయవలసిన ముఖ్యమైన బాధ్యతలను తెలుసుకుని వాటిని సకాలంలో పూర్తి చేసే పని చేపడదాం.

ఆర్థిక వ్యవహారాల్లో కూడా మార్చి ముఖ్యమైనది. వ్యవహారాలు పూర్తి దశకి రావడానికి, బడ్జెట్‌ ప్రకారం నిధులు ఖర్చు పెట్టడానికి, గ్రాంట్లను పూర్తి చేయడానికి, ప్రాజెక్టుల పూర్తికి.. ఇలా ఎన్నో పన్నుయేతర వ్యవహారాలకు మార్చి కటాఫ్‌లాంటిది. ఈ గడువు ఓ గండంలాంటిది. బుక్స్‌ క్లోజ్‌ చేయాలి. మీరు బుక్స్‌ రాయకపోయినా, వాటి నిర్వహణ కంపల్సరీ. రాయకపోయినా ఒకసారి వ్యవహారాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి.

ఏప్రిల్‌ నుంచి మీ బ్యాంకు అకౌంటు స్టేట్‌మెంట్లు, లోన్‌ చెల్లింపులు, ఇన్సూరెన్స్‌ చెల్లింపులు, ఇంటి మున్సిపల్‌ పన్నుల చెల్లింపులు, మెడిక్లెయిమ్, మీ దగ్గర పని చేసే ఉద్యోగులకు సంబంధించి చట్టబద్ధమైన చెల్లింపులు, పిల్లల చదువులకు సంబంధించిన ట్యూషన్‌ ఫీజులు, 80సీ కింద అర్హత ఉన్న చెల్లింపులు.. ఇలా ఎన్నో ఉంటాయి. తెలుసుకోండి. తేల్చుకోండి. ఇందులో ఎక్కువ చెల్లింపులకు పాత పద్ధతిలోనే మినహాయింపు దొరుకుతుంది. అయినా చెల్లింపులు చేయడం.. ఒక మంచి అలవాటు. క్రమశిక్షణకు దారి తీస్తుంది.

ఆర్ధిక చెల్లింపులలో ముందు, వెనుకలు కాకుండా నిలకడకు దారి తీస్తుంది. ఒక నిశ్చితి పరిస్థితికి దోహదపడుతుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రావాల్సిన ప్రయోజనాలు వస్తాయి. కాబట్టి, అశ్రద్ధ చేయవద్దు. మీ వ్యాపారం చిన్నదే కావొచ్చు. జీఎస్‌టీ పరిమితులలోపు ఉండొచ్చు. ఆడిట్‌ అవసరం లేకపోవచ్చు. కానీ అకౌంట్స్‌ విషయంలో బద్ధకం వద్దు. ముఖ్యంగా క్యాపిటల్‌ ఖర్చు, రెవెన్యూ ఖర్చు, సరుకుల నిల్వ మొదలైనవి ముఖ్యమైనవి.

జీఎస్‌టీ టర్నోవరు రిటర్నులతో మీ ఇన్వాయిస్‌ల ప్రకారం టర్నోవరు, మీ బుక్స్‌ ప్రకారం టర్నోవరు చెక్‌ చేసుకోండి. స్థూల ఆదాయం పూర్తిగా పన్నుకి గురికాదు. ఆదాయం కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్‌గా వచ్చి, జరగాల్సిన పని ఏప్రిల్‌లో జరగొచ్చు. ఈ వ్యవహారాల్లో టీడీఎస్‌ అంశం ఉంటుంది. అనుమానం ఉంటే అటు పక్క వెండార్స్‌తో ఉత్తరప్రత్యుత్తరాలు జరపండి. ఇద్దరి రికార్డుల్లో అంకెలు, వివరణ, అకౌంటింగ్‌ సర్దుబాటు, సమన్వయం ఒకేలాగా ఉండాలి. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించండి. 2026 మార్చి 31 నాటికి మీ ఆదాయం విషయంలో టీడీఎస్‌ సరిపోతే సరే సరి. లేదంటే కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్‌ ట్యాక్స్‌ బాధ్యత ఏర్పడుతుంది.

ఆదాయం అంచనాల్లో వ్యత్యాసాలు ఏర్పడవచ్చు. పన్ను భారం పెరగొచ్చు. గత మూడు వాయిదాల్లో షార్ట్‌ఫాల్‌ ఉండొచ్చు. అలాంటి వాటిని మళ్లీ లెక్కించి, కచ్చితమైన లెక్కలు తేల్చండి. రివైజ్‌ చేసిన లెక్కల ప్రకారం అడ్వాన్స్‌ ట్యాక్స్‌ మార్చి 15 లోపల చెల్లించండి. పాత సంవత్సరాల విషయంలో నోటీసులు రావచ్చు. మిమ్మల్ని హెచ్చరిస్తారు. సూచనలు చేస్తారు. ఒక రాయి విసురుతారు. వాటి సారాంశాన్ని బట్టి మీరు రిటర్నులను రివైజ్‌ చేసుకోవచ్చు. ముందు రాబోయే ఆపదల కన్నా, ఎంక్వైరీలకన్నా, అసెస్‌మెంట్‌ కన్నా, పెనాల్టీల కన్నా ఉత్తమమైనది, శాంతియుతంగా క్లోజ్‌ అయ్యేది.. రివైజ్‌ రిటర్ను వేయడం. అనివార్యమైతే వెంటనే రంగంలోకి దూకండి.

ఇవి కాకుండా జీఎస్‌టీలోని కొన్ని స్కీములకు, టీడీఎస్‌ల డిపాజిట్లకు, టీసీఎస్‌ఐ చెల్లింపులకు, వృత్తి పన్ను చెల్లింపులకు, పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులు, రిటర్నులకు, ముఖ్యంగా టీడీఎస్‌ తక్కువ రేట్లతో వర్తింప చేసేందుకు లేదా వద్దనుకునేందుకు ఫారం 13 వేయాలి. అది కూడా 2026 మార్చి 15లోగా దాఖలు చేయాలి. 2026 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త చట్టం, కొత్త రూల్స్‌ అమల్లోకి వస్తాయి. కొత్త ఫారాలు వాడుకలోకి వస్తాయి. కొత్త ఫారంలో సమాచారం ఇవ్వడానికి 2026 మార్చి ముగిసేలోగా సర్వం సిద్ధం చేసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement