‘అసలుకు అచ్చుగుద్దినట్లు చేస్తే ఊరుకోం’ | ByteDance Halts Global Launch of Seedance 2 After Hollywood Copyright Clash | Sakshi
Sakshi News home page

‘అసలుకు అచ్చుగుద్దినట్లు చేస్తే ఊరుకోం’

Mar 15 2026 5:20 PM | Updated on Mar 15 2026 5:52 PM

ByteDance Halts Global Launch of Seedance 2 After Hollywood Copyright Clash

సీడ్యాన్స్‌ 2.0ను నిలిపేసిన చైనా

కాపీరైట్‌ నిబంధనల ఉల్లంఘనలే కారణం

ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్, క్యాప్‌కట్ వంటి యాప్‌లతో సంచలనం సృష్టించిన చైనా కంపెనీ ‘బైట్‌డ్యాన్స్’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రతిష్టాత్మకమైన ఏఐ వీడియో జనరేషన్ మోడల్ ‘సీడ్యాన్స్ 2.0’ గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ నిరవధికంగా నిలిపివేసింది. హాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల నుంచి కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు రావడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

వివాదానికి కారణం ఇదే..

సీడ్యాన్స్ 2.0 సృష్టించే వీడియోలు అచ్చం హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలను తలపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని క్లిప్స్ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేశాయి. అందులో హాలీవుడ్‌ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ మధ్య జరిగిన పోరాట దృశ్యాలు రియలిస్టిక్‌గా ఉన్నాయి. ఐకానిక్ క్యారెక్టర్లుగా పేరున్న స్పైడర్ మ్యాన్, వెనమ్ వంటి సూపర్ హీరోలతో పాటు ప్రముఖ యానిమేషన్‌ క్లిప్‌లను ఈ ఏఐ మోడల్ అత్యంత నాణ్యతతో సృష్టించింది.

దాంతో తమ మేధో సంపత్తిని అనుమతి లేకుండా ఈ మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించారని హాలీవుడ్ స్టూడియోలు మండిపడుతున్నాయి.

హాలీవుడ్ దిగ్గజాల ధ్వజం

ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ గత నెలలోనే బైట్‌డ్యాన్స్‌కు ‘సీజ్ అండ్ డెసిస్ట్’ (నిలిపివేత) లేఖను పంపింది. తమ కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడుకున్నారని డిస్నీ ఆరోపించింది. మరోవైపు, పారామౌంట్ స్కైడాన్స్ సైతం రంగంలోకి దిగింది. ‘స్టార్ ట్రెక్, ది గాడ్ ఫాదర్, సౌత్ పార్క్ వంటి మా ఐకానిక్ చిత్రాల హక్కులను బైట్‌డ్యాన్స్ ఉల్లంఘించింది’ అని పారామౌంట్ స్పష్టం చేసింది.

సీడ్యాన్స్ 2.0 ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, ఇ-కామర్స్, అడ్వర్టైజింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పుల కోసం రూపొందించారు. ఒకవేళ ఇది గ్లోబల్ మార్కెట్లోకి వస్తే హాలీవుడ్ ఉనికికే ప్రమాదమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం

Advertisement
 
Advertisement
Advertisement