భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం అత్యంత బలంగా, స్థిరంగా ఉంది. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకులు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బీఎప్‌సీ) నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన ‘ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2024-25’ నివేదిక ఆధారంగా, బ్యాంకులు మెరుగైన లాభాలను సాధిస్తున్నప్పటికీ డిజిటలైజేషన్, కొత్త రకపు రిస్కుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక వనరుల సమీకరణలో సమతుల్యత
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వాణిజ్య రంగానికి అందిన మొత్తం నిధులు రూ.35.1 లక్షల కోట్లు. ఇందులో బ్యాంకుల వాటా (రూ.18 లక్షల కోట్లు), బ్యాంకింగేతర వనరుల వాటా (రూ. 17.1 లక్షల కోట్లు) దాదాపు సమానంగా ఉన్నాయి. అందుకు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడం, అధికంగా జరుగుతున్న ఈక్విటీ ఇష్యూలు, కార్పొరేట్ బాండ్లు, విదేశీ రుణాల లభ్యత.. వంటి అంశాలు కలిసొచ్చాయి.
గత కొన్ని ఏళ్లుగా చేపట్టిన సంస్కరణల వల్ల షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. బ్యాంకుల గ్రాస్ ఎన్‌పీఏ (స్థూల నిరర్థక ఆస్తులు) నిష్పత్తి గత దశాబ్ద కాలంలోనే కనిష్ఠ స్థాయికి, అంటే 2.2 శాతానికి పడిపోయింది. సెప్టెంబర్ 2025 నాటికి ఇది ఇంకా తగ్గి 2.1 శాతానికి చేరుకోవడం విశేషం. బ్యాంకుల వద్ద తగినంత మూలధనం ఉంది. సెప్టెంబర్ 2025 నాటికి బ్యాంకుల CRAR(ఒక బ్యాంక్ తన వద్ద ఉన్న రిస్కులకు తగినంత మూలధనాన్ని కలిగి ఉందో లేదో కొలిచే కొలమానం ఇది) 17.2 శాతంగా ఉంది. ఇది నియంత్రణ సంస్థలు సూచించిన 11.5 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2024-25లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు 11.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ఎన్‌బీఎఫ్‌సీల హవా
దేశంలోని మొత్తం బ్యాంక్ క్రెడిట్‌లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 25 శాతానికి చేరింది. బ్యాంకింగ్ సర్వీసులు అందించలేని మారుమూల ప్రాంతాలకు, చిన్న తరహా పరిశ్రమలకు నిధులు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి స్థూల నిర్ధరక ఆస్తులు మార్చి 2025 నాటికి 2.9 శాతానికి చేరింది. ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐలు (Microfinance) కూడా 24.9 శాతం క్యాపిటల్ బఫర్‌తో బలంగా ఉన్నాయి.
కొత్త సవాళ్లు
బ్యాంకింగ్ రంగం ఎంత వేగంగా డిజిటలైజ్ అవుతుందో అంతే వేగంగా కొత్త రిస్కులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఆన్‌లైన్ మోసాలు, డేటా ఉల్లంఘనలు బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. సాంకేతిక మార్పులను త్వరగా అందిపుచ్చుకోకపోతే బ్యాంకులు తమ వినియోగదారులను కోల్పోయే ప్రమాదం ఉంది.
ఆర్‌బీఐ సూచనలు
భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆర్‌బీఐ కొన్ని కీలక సూచనలు చేసింది. ‘బ్యాంకులు తమ రిస్క్ అసెస్‌మెంట్‌ను మరింత పటిష్టం చేసుకోవాలి. పారదర్శకమైన పాలన, బాధ్యతాయుతమైన సాంకేతికతను వాడాలి. పెరిగిపోతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. ఎన్‌బీఎఫ్‌సీలు కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా తమ నిధుల మూలాలను వైవిధ్య పరచాలి’ అని ఆర్‌బీఐ తెలిపింది.
ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం


