టోల్ వసూళ్లకు సంబంధించి.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును తగ్గించాలని నిర్ణయించింది. ఇది 2026 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిర్మాణం పూర్తికాని లేదా కొంత భాగం మాత్రమే ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును 25 శాతం తగ్గించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2008లో అమలులోకి వచ్చిన జాతీయ రహదారుల ఫీజు నియమాలలో సవరణలు చేసి ఈ తగ్గింపును అమలులోకి తీసుకురానున్నారు.
ఇప్పటివరకు.. ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా అందుబాటులో లేకపోయినప్పటికీ.. ప్రయాణికులు ఎక్కువ టోల్ చెల్లించాల్సి వచ్చేది. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోయినా.. ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అనేది ప్రజలకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టోల్ చెల్లింపులు తగ్గిస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడ వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 25 శాతం టోల్ ఫీజు తగ్గింపు అనేది శాశ్వతం కాదు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత సాధారణ టోల్ ఫీజును వసూలు చేస్తారు. అంటే సాధారణ ఎక్స్‌ప్రెస్‌వే రేట్లు అమలులోకి వస్తాయన్నమాట.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. ప్రజలను కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలను ఉపయోగించేందుకు ప్రోత్సహించడమే. టోల్ ఫీజు తక్కువగా ఉంటే ఎక్కువ మంది ఆ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో జాతీయ రహదారులపై ట్రాఫిక్ తగ్గుతుంది.
ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!


