టోల్‌ప్లాజాల వద్ద బారులుతీరిన వాహనాలు
వరంగల్ రూట్లో పండుగ, మేడారం జాతరకు...
హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై డ్రోన్ కెమెరాతో నిఘా
బైక్‌లపై భారీ సంఖ్యలో వెళుతున్న ప్రజలు
చౌటుప్పల్/భువనగిరిటౌన్/చిట్యాల/కేతేపల్లి/ సూర్యాపేటటౌన్: మూడోరోజూ రహదారులపై రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదివారం కూడా ప్రజలంతా పట్నం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారితోపాటు హైదరాబాద్– వరంగల్ రహదారిపై వాహనాలు బారులుదీరాయి. గంట సమయంలో చేయాల్సిన ప్రయాణం రద్దీ కారణంగా రెండు గంటలకు పైగా సమయం పట్టింది. చౌటుప్పల్ పట్టణంలో ట్రాఫిక్ స్తంభించింది. ఇదే మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటరు దూరం వరకు బారులుదీరాయి.
టోల్‌ప్లాజా వద్ద 16 టోల్ బూత్‌లు ఉండగా సాధారణ రోజుల్లో ఇరువైపులా సమానంగా 8 బూత్‌ల చొప్పున కేటాయిస్తారు. ప్రస్తుత రద్దీ నేపథ్యంలో విజయవాడ మా ర్గంలో 12 బూత్‌లు, హైదరాబాద్ మార్గంలో 4 బూత్‌లను కేటాయించారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 46 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు మరో 15వేల వరకు వాహనాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
⇒ నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిక్కిరిశాయి. సాధారణ రోజుల్లో రోజూ 18 వేల నుంచి 20 వేల వాహనాలు ఈ టోల్‌ప్లాజా నుంచి రాకపోకలు సాగిస్తుండగా ఆదివారం ఒక్కరోజే దాదాపు 40 వేల వాహనాలు వెళ్లినట్టు అధికారులు తెలిపారు.
⇒ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూ రు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఒక వైపు సంక్రాంతి పండుగ సెలువులతోపాటు, మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వరంగల్ దిశగా పట్నంవాసులు పెద్ద సంఖ్యలో ప్రయాణించడంతో రహదారి రద్దీగా మారింది.
⇒ సంక్రాంతి పండుగకు వెళ్తున్న ప్రయాణికుల వాహనాలు ఎక్కడా ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు నిరంతరం డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. క్రేన్లు, అంబులెన్సులు, టోయింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు.
⇒ హైదరాబాద్–విజయవాడ హైవేపై కార్లు, బస్సులతోపాటు పెద్ద వాహనాలు వేలాదిగా వెళుతుండటంతో నిత్యం ట్రాఫిక్‌జాం అవుతోంది. దీంతో కొందరు ప్రయాణికులు తమ కుటుంబసభ్యులతో బైక్‌లపై వెళుతున్నారు.


