Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి | 4 Dead 9 Injured After Mumbais BEST Bus Crashes | Sakshi
Sakshi News home page

Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి

Dec 30 2025 6:48 AM | Updated on Dec 30 2025 6:56 AM

4 Dead 9 Injured After Mumbais BEST Bus Crashes

ముంబై: ముంబై మహానగరంలోని భండూప్ ప్రాంతంలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ముంబై నగర రవాణా సంస్థ (బెస్ట్‌)కు చెందిన ఒక  ఎలక్ట్రికల్‌ బస్సు అదుపు తప్పి, పాదచారులపైకి దూసుకెళ్లడంతో నలుగురు పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

నిత్యం రద్దీగా ఉండే భండూప్ స్టేషన్ రోడ్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విఖ్రోలి డిపోకు చెందిన ఈ బస్సు (రూట్ నంబర్ A-606) తన ప్రయాణాన్ని ముగించుకుని స్టేషన్ సమీపంలో రివర్స్ తీస్తుండగా, ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అజాగ్రత్త, సాంకేతిక లోపం కారణంగా బస్సు ఒక్కసారిగా వెనుక ఉన్న పాదచారులను బలంగా ఢీకొంది. ఆ సమయంలో రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న ప్రయాణికులు, పాదచారులు అప్రమత్తమయ్యేలోపే బస్సు వారిపైకి దూసుకువచ్చింది. ఈ ఘటన స్థానికంగా  కలకలంరేపింది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన తొమ్మిది మందిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా వెట్ లీజు (Wet Lease) ప్రాతిపదికన నడిచే బస్సుల నిర్వహణ, డ్రైవర్ల శిక్షణ, బస్సుల కండిషన్‌పై కఠినమైన తనిఖీలు ఉండాలని ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ కోరారు. రద్దీ ప్రాంతాల్లో బస్సులను వెనుకకు తీసే సమయంలో సహాయకులు (Helpers) ఉండాలని, డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని  పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement