ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసేవారికైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోని సందర్భాల్లో మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి?, ఇది చాలామంది మనసులో మెదిలే ప్రశ్న. ఈ ప్రశ్నకు.. ఇక్కడ సమాధానం తెలుసుకుందాం.
నిజానికి పర్సనల్ లోన్ పొందటానికి దాదాపు ఎలాంటి ఆస్తులకు పూచీకత్తు అవసరం లేదు. కాబట్టి దీనిని అన్‌సెక్యూర్డ్ లోన్ కింద పరిగణిస్తారు. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే చెల్లింపు విషయం కొన్ని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
చాలా బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు లోన్‌తో పాటు లోన్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాయి. ఆలాంటి ఇన్సూరెన్స్ ఉంటే.. లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. కాబట్టి లోన్ భారం.. మరణించిన లోన్ తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులపై పడదు. ఇన్సూరెన్స్ లేని సందర్భంలో.. కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.
లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతనికి చెందిన ఆస్తులు ఏవైనా ఉంటే, బ్యాంక్ ఆ ఆస్తులపై క్లెయిమ్ చేయవచ్చు. ఆ ఆస్తుల విలువలో నుంచి లోన్ మొత్తాన్ని తీసుకుంటారు. మిగిలింది వారసులకు అప్పగిస్తుంది. ఒకవేళా కో-అప్లికెంట్ ఉన్నట్లయితే.. ఆ వ్యక్తే లోన్ చెల్లించాలి. గ్యారెంటర్ ఉంటే.. బ్యాంక్ గ్యారంటర్ దగ్గర నుంచి లోన్ రికవర్ చేస్తుంది
ఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?
ఏ ఆస్తులు లేవు, కో-అప్లికెంట్ లేరు, గ్యారంటర్ లేరు అన్నప్పుడు.. కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ బ్యాంక్ లీగల్ నోటీసులు పంపిస్తుంది. దానికి కుటుంబ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు లోన్ మాఫీ చేసే అవకాశం కూడా ఉంది.


