2025లో 44,885 యూనిట్లకు పరిమితం
గతేడాది విక్రయాలు 58,540 యూనిట్లు
ఆరు నగరాల్లో ఈ ఏడాది పడిపోయిన అమ్మకాలు
హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఈ ఏడాది నీరసించింది. విక్రయాలు క్రితం ఏడాదితో పోల్చి చూసినప్పుడు 23 శాతం తగ్గి 44,885 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది అమ్మకాలు 58,540 యూనిట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. ఒక్క చైన్నై నగరంలో మాత్రం డిమాండ్ పుంజుకుంది. ఇళ్ల యూనిట్ల అమ్మకాలు తగ్గినప్పటికీ, విలువలో మాత్రం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసింది. ప్రాపర్టీ ధరలు పెరగడం, ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు, భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు విక్రయాలు తగ్గడానికి కారణాలుగా అనరాక్ పేర్కొంది. ఏడు నగరాల్లో ఇళ్ల ధరలు ఈ ఏడాది సగటున 8 శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది.
విక్రయాలు ఇలా..
మొత్తం ఏడు నగరాల్లో 2025లో ఇళ్ల అమ్మకాలు ఇప్పటి వరకు 3,95,625 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది విక్రయాలు 4,59,645 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది అమ్ముడుపోయిన ఇళ్ల విలువ రూ.6 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది అమ్మకాల విలువ రూ.5.68 లక్షల కోట్లతో పోలిస్తే 6 శాతం పెరిగింది.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 1,27,875 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది కంటే 18 శాతం తగ్గాయి.
పుణెలోనూ క్రితం ఏడాదితో పోల్చితే 20 శాతం తక్కువగా 65,135 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
బెంగళూరులో 5 శాతం తక్కువగా 65,135 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో విక్రయాలు 57,220 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది విక్రయాలు 61,900 కంటే 8 శాతం తగ్గాయి.
కోల్‌కతాలో 16,125 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాదితో పోలి్చతే 12 శాతం పడిపోయాయి.
చెన్నైలో మాత్రం అమ్మకాలు క్రితం ఏడాదితో పోల్చితే 15 శాతం పెరిగాయి. 22,180 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
2024లో ఇళ్ల ధర చదరపు అడుగునకు రూ.8,590గా ఉంటే, ఈ ఏడాది 8 శాతం పెరిగి రూ.9,260కు చేరుకుంది.
2026 అమ్మకాలు ఎలా ఉండొచ్చు?
క్రితం ఏడాది డబుల్ డిజిట్ స్థాయిలో ఇళ్ల ధరలు పెరగ్గా.. ఈ ఏడాది సింగిల్ డిజిట్ పెరుగుదలతో ఆగినట్టు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. 2026లో ఇళ్ల మార్కెట్ పనితీరు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, ఇళ్ల ధరల తీరు అమ్మకాలను ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం


