టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం మిశ్రమ ఫలితాలతో కూడుకొని ఉంది. అతని మార్గదర్శకత్వంలో భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అదరగొడుతున్నా.. టెస్ట్‌ల్లో మాత్రం తేలిపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలొ క్లీన్ స్వీప్‌తో (0-3)మొదలైన గంభీర్ టెస్ట్ ప్రస్తానం (టీమిండియా హెడ్ కోచ్‌గా).. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ (0-2) వరకు సాగింది.
ఈ మధ్యలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్‌పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్ పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోయి, ఇంగ్లండ్ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది.
టెస్ట్‌ల్లో పేలవ ట్రాక్ రికార్డు కలిగి ఉండటంతో పాటు అనునిత్యం వివాదాలతో సావాసం చేసే గంభీర్‌ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్ విధుల నుంచి తప్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో గంభీర్‌పై వేటు ఖాయమని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
గంభీర్ స్థానంలో భారత టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్షణ్ ఎంపిక ఖరారైందని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేశాయి.
ఇదే అంశంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. గంభీర్‌పై వేటు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టెస్ట్ జట్టు విధుల నుంచి గంభీర్‌ను తప్పించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు.
గంభీర్ టెస్ట్ జట్టు కోచ్‌గా కొనసాగడానికి మద్దతు ప్రకటించారు. సైకియా చేసిన ఈ ప్రకటనతో గంభీర్ టెస్ట్ హెడ్‌కోచ్‌మెన్‌షిప్‌పై ఊహాగానాలు తొలగిపోయాయి.
ముందుంది ముసళ్ల పండగ
ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో (2005-27) గంభీర్ మార్గదర్శకత్వంలో భారత టెస్ట్ జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది. గంభీర్ రాకకు ముందు వరుసగా రెండు డబ్ల్యూటీసీ సైకిల్స్‌లో ఫైనల్స్‌కు చేరిన టీమిండియా.. గత ఎడిషన్‌లో ఫైనల్స్‌కు చేరుకుండానే ఇంటిదారి పట్టింది.
తాజా సైకిల్‌లో కూడా పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఈ సైకిల్‌లో భారత్ ఇప్పటివరకు ఆడిన 9 టెస్ట్ మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ సైకిల్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే ఇంకా ఆడాల్సిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు సాధించాలి.
అయితే ఇలా జరగడం అంత ఈజీగా కనిపించడం లేదు. భారత్ తదుపరి ఐదు ఆస్ట్రేలియాతో, రెండు న్యూజిలాండ్‌తో ఆడాల్సిన ఉంది. మిగిలిన రెండు శ్రీలంకతో ఆడాల్సి ఉంది. శ్రీలంకపై టీమిండియా పైచేయి సాధించినా.. ఆసీస్, కివీస్‌పై గెలవడం మాత్రం అంత ఈజీగా కాదు.


