తమిళనాడులోని నీలగిరి కొండలలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఊటీ. దీనిని "భారతదేశపు స్విట్జర్లాండ్" అని కూడా పిలుస్తారు, ఇది వేసవికాలంలో గొప్ప విడిది స్థలం. ఊటీ ఎల్లప్పుడూ హృదయానికి హాయిగా అనిపించే హిల్‌స్టేషన్లలో ఒకటి. ఈ ముగ్ధ మనోహరమైన పట్టణాన్ని చూసేందుకు పలు కుటుంబాలు, జంటలు, ఒంటరి పర్యాటకులు, ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవారు ఇక్కడి ఎత్తైన కొండలను అన్వేషించేందకు వాలిపోతుంటారు.
ఓ పక్క అందమైన మేఘాల కదలికలు..మరోవైపు వేడి టీ ఆస్వాదిస్తూ..పైన్ అడువుల గుండా నిశబ్దంగా వెళ్తుంటే..మిమ్మల్ని వేగాన్ని తగ్గించి ప్రతి క్షణం ఆస్వాదించేలా అనుభూతి చెందేలా చేస్తుంది అక్కడి ప్రకృతి కమనీయ దృశ్యాలు. ప్రస్తుతం ఇది అందానికే కాదు, బాధ్యతాయుతమైన పర్యాటకాలో మేటి అనిపించికుంటోంది ఊటీ. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
కొన్ని రోజుల క్రితం ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ బార్గవి సిలాపర్శెట్టి ఊటీ ట్రిప్‌కి సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించడంతో చాలామంది ప్రయణికులు ఆ మిషన్‌ల వద్ద వాటర్‌ని నింపుకుని తెచ్చుకోవడం ఆసక్తిని రేకెత్తించడంతో ఆ విషయాన్ని బార్గవి ఇలా వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు.
పర్యావరణానికి హాని కలిగించకుండా సందర్శకులు హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడే నీటి ATMలను పట్టణంలో ఏర్పాటు చేశారు. అక్కడ భార్గవి నీటి ఏటీఎం కియోస్క్‌కు చేరుకుని అక్కడ లోపల ఉన్న ఒక మహిళకు ఆ బాటిల్‌ని అందజేయగానే ఆమె వేడి నీటిని నింపి తిరిగి భార్గవికి అందజేస్తుంది. ధర ఎంత అనడగగానే కేవలం రూ. 10 అని చెబుతుండటం కనిపిస్తుంది వీడియోలో.
ఈ వీడియోని చూసిన నెటిజన్లంతా ప్రతి పర్యాటక ప్రదేశంలోనూ దీన్ని అమలు చేయాలని కొందరూ, దేశవ్యాప్తంగా ఒకే ప్రామాణిక పద్ధతి ఉండాలని మరికొందరూ ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. కాగా ఈ ఊటీలో చూడదగ్గ కమనీయ ప్రదేశాలేంటంటే..
1. ఊటీ సరస్సు
పట్టణంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడ బోటింగ్‌కు వెళ్లవచ్చు, సరస్సు చుట్టూ విశ్రాంతిగా నడవవచ్చు లేదా కూర్చుని దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇది ఉల్లాసంగా ఉంటుంది కానీ ప్రశాంతంగా ఉంటుంది.
2. నీలగిరి పర్వత రైల్వే
ఇక్కడ టాయ్ ట్రైన్ ప్రయాణం తప్పనిసరిగా చేయాలి. ఇది సొరంగాలు, అడవులు, టీ తోటల గుండా నెమ్మదిగా కదులుతుంది. అక్కడ ప్రకృతి దృశ్యాలను ఫోటోలు తీస్తూ మునగిపోతాం.
3. టీ తోటలు, టీ ఫ్యాక్టరీ
ఊటీలోని టీ ఎస్టేట్‌లు అందంగా, ప్రశాంతంగా ఉంటాయి. పచ్చని పొలాల గుండా నడిచి టీ ఎలా తయారు చేస్తారో చూడటానికి టీ ఫ్యాక్టరీని సందర్శించొచ్చు. అక్కడ తప్పనిసరిగా తాజా టీ కొనడం మర్చిపోవద్దు.
4. బొటానికల్ గార్డెన్
ఇక్కడ రంగురంగుల పూలతో నిండిన ఈ తోట గుండా ప్రశాంతంగా నడవడం అద్భుతంగా ఉంటుంది. ఇది ఉదయం లేదా మధ్యాహ్నం చాలా అందంగా ఉంటుంది.
5. దొడ్డబెట్ట శిఖరం
ఊటీలోని ఎత్తైన ప్రదేశం నీలగిరి విస్తృత దృశ్యాలను అందిస్తుంది. పర్యావరణ అనుకూలలమైన రోజున ఈ కొండను ఎక్కేందుకు అద్భుత క్షణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఊటీ ప్రయాణం అందంతోపాటు బాధ్యతయుతమైన పర్యాటకంగా అందరి మనసులను దోచుకుంటోంది.
(చదవండి: 'అరటికాండంతో పప్పు' రెసిపీ ..ఆరోగ్యానికి ఎంతో మేలు..!)


