బెంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ సమీపంలోని బ్రహ్మరకూట్లు టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టోల్ ఫీజు చెల్లించే విషయంలో మొదలైన వివాదం టోల్ సిబ్బందిపై దాడికి దారితీసింది. లారీ డ్రైవర్, క్లీనర్ కలిసి టోల్ గేటును ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి సిబ్బందిపై దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిక్కమగళూరుకు చెందిన భరత్ (23) అనే లారీ డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్‌లో టోల్ ప్లాజా వద్దకు తీసుకువచ్చాడు. డ్యూటీలో ఉన్న టోల్ సిబ్బంది టోల్ రుసుము చెల్లించాలని కోరగా, డ్రైవర్ నిరాకరిస్తూ, గొడవకు దిగాడు. ఆవేశంతో వాహనాన్ని ముందుకు పోనిచ్చి టోల్ గేటును ఢీకొట్టి, దానిని ధ్వంసం చేశాడు. అనంతరం డ్రైవర్ భరత్, క్లీనర్ తేజస్ (26) కలిసి అక్కడి సిబ్బంది అంకిత్, రోహిత్‌లను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిపై దాడికి దిగారు.
నిందితులు అంతటితో ఆగకుండా, తమకు తోడుగా మరికొందరిని పిలిపించి, మరోమారు టోల్ ప్లాజాపై దాడి చేశారు. ఈ ఘటనతో టోల్ ప్లాజా వద్ద కొంతసేపు పనులు నిలిచిపోయాయి. టోల్ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్ ఫిర్యాదు మేరకు బంట్వాల్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై కేసు నమోదు చేశారు. వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టోల్ ప్లాజాల వద్ద సిబ్బంది రక్షణ కోసం భద్రతను పెంచాలని, ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై నిఘా పెట్టేందుకు సీసీటీవీ దృశ్యాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏడాది చివరిలో ఘోరం.. ఏడుగురు మృతి


