అల్మోరా: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భికియాసైన్ నుండి రామ్‌నగర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి, వినాయక్ ప్రాంతంలోని ఒక లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 17 నుండి 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు తెల్లవారుజామున సుమారు 6 గంటలకు ద్వారహత్ నుండి బయలుదేరింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో శైలాపాని సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వందల అడుగుల లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రమాద వార్త తెలియగానే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్), స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలో పడిపోయిన క్షతగాత్రులను వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గాయపడిన వారిని వెంటనే భికియాసైన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా యంత్రాంగం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి


