జమ్మూ కశ్మీర్: దోడా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృతిచెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఉధాంపూర్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
భదర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారిలోని ఖన్నీ టాప్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 17 మంది సిబ్బందితో వెళ్తున్న ఆర్మీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎత్తైన ప్రాంతంలోని పోస్ట్‌కు వెళ్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం.. లోయలోకి దూసుకెళ్లింది.
కాగా, ఈ నెల 8న గుల్మార్గ్ సెక్టార్‌లోని ఎల్‌వోసీ సమీపంలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లు కాలుజారి మృతిచెందిన సంగతి తెలిసిందే. గల్లంతైన పోర్టర్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా, రెండు రోజుల తర్వాత వారి మృతదేహాలు లభించాయి. మృతులను చందూసా బారాముల్లాకు చెందిన లాయఖత్ అహ్మద్ దీదార్డ్ (27), ఇష్ఫాక్ అహ్మద్ ఖతానా (33)గా గుర్తించారు. గత ఏడాది మే నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఆర్మీ వాహనం రోడ్డుపై నుంచి 700 అడుగుల లోయలో పడిపోవడంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది మరణించారు.


