రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్-భటపారా జిల్లాలో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. ఓ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో సంభవించిన భారీ పేలుడుకు ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 10 మంది తీవ్ర గాయాలపాలైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను పిటిఐ వార్తా సంస్థ వెల్లడించింది.
పోలీసుల కథనం ప్రకారం భటపారా గ్రామీణ ప్రాంతంలోని బకులాహి గ్రామంలో ఉన్న ‘రియల్ ఇస్పాట్ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ’లో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలంలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయి. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసిన దృశ్యాలు వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి భారీ ప్రమాదం జరిగిందన్న సమాచారం అందగానే పోలీసులు, జిల్లా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
VIDEO | Balodabazar-Bhatapara, Chhattisgarh: Six workers feared dead and over 10 injured in a blast reported at a steel factory. More details awaited.
(Source: Third Party)#Chhattisgarh pic.twitter.com/P7fqqnW6LC— Press Trust of India (@PTI_News) January 22, 2026
అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాయి. మంటలను అదుపులోకి తేవడంతో పాటు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాల లోపం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు.


