జావా: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మరణించగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలుస్తోంది. పశ్చిమ బాండుంగ్ ప్రాంతంలోని పసిర్లాంగు గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 30 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి.
ఇండోనేషియా విపత్తు నివారణ సంస్థ నివేదికల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బురాంగ్రాంగ్ పర్వత వాలులలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద నీరు, బురద, రాళ్లు గ్రామంపైకి దూసుకొచ్చాయి. గ్రామంలోని ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సంభవించిన ఈ విపత్తులో 30 ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పెద్ద శబ్దాలు వినిపించాయని, ఆ వెంటనే ఆకస్మిక వరదలు గ్రామాన్ని ముంచెత్తాయని స్థానిక పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
‘గల్లంతైన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మేము సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టామని’ జాతీయ విపత్తు నివారణ సంస్థ (బీఎన్‌పీబీ) ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు. ఇండోనేషియా సైన్యం, ప్రాంతీయ విపత్తు నిర్వహణ బృందాలు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బురద, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు బృందాలు శ్రమిస్తున్నప్పటికీ, ప్రతికూల వాతావరణం సవాలుగా మారింది.
మరిన్ని కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ప్రభావం ఉన్నట్లు అంచనా. పశ్చిమ జావా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కరావాంగ్ తదితర జిల్లాల్లో నదులు పొంగిపొర్లుతుండటంతో వరదలు సంభవించాయి. గత నెలలో ఉత్తర సుమత్రా, ఆచే ప్రాంతాల్లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 1,100 మందికి పైగా మరణించారు. ఈ విషాదం మరువక ముందే తాజా ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం


