మార్చి నెల వచ్చేసింది. ఎండ తాపం మొదలైంది. జనాలు అప్పుడే ఎండ వేడిమి తాళలేక ఉసూరుమంటున్నారు. బయటి వెళ్లినవారు మజ్జిగ, చెరుకురసం, పళ్లరసాలను తాగుతూ కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఏటా వేసవి కాలంలో ఇవన్నీ సహజంగా జరిగేవే. అయితే ఒకానొక సంవత్సరం అసలు వేసవే లేకుండా గడిచిపోయింది. ఆ విషయం మీకు తెలుసా?
అవును..1816 సంవత్సరం వేసవి లేకుండా గడిచిపోయింది. అందుకే దాన్ని ‘The Year without Summer’ అని పిలుస్తారు. ఆ ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 0.4–0.7 సెంటిగ్రేడ్‌లు తగ్గాయి. ఆ సంవత్సరం యూరప్‌లో వేసవి ఉష్ణోగ్రతలు సైతం అత్యంత చల్లగా ఉన్నాయి.
1815 ఏప్రిల్‌లో ఇండోనేషియాలో మౌంట్ టాంబోరా విస్ఫోటనం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. 1,300 సంవత్సరాలలో ఇది అతి పెద్ద విస్ఫోటనం అంటున్నారు. వాతావరణంపై దాని ప్రభావం పడటం వల్ల వేసవి లేకుండా గడిచిపోయిందంటున్నారు. ఎండలు లేకపోతే హాయిగా ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనకు ఎండలు చాలా అవసరం.
చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత!
ఎండలు లేకపోతే వర్షాలు సక్రమంగా కురవవు. పంటలు సరిగ్గా పండవు. దీంతో 1816లో ప్రపంచం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, బోర్బన్ రిస్టోరేషన్ ఫ్రాన్స్ వంటి దేశాలు కరువు బారిన పడ్డాయి. 1816 తర్వాత మళ్లీ ఇప్పటిదాకా వేసవి లేని ఏడాది రాలేదు.


