సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని భవానిపురంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక అపార్ట్మెంట్‌లోని ఐదవ అంతస్తులో అగ్ని కీలలు వ్యాపించాయి. ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపార్ట్మెంట్‌లో చిక్కుకున్న వృద్ధులను కాపాడారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు.
ఏసీల వినియోగం పెరిగిన నేపథ్యంలో వాటి నిర్వహణలో లోపాలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేయడం వల్ల విపరీతంగా వేడెక్కి మంటలు చెలరేగే అవకాశం ఉంది. దీనికి తోడు ఏసీలోని రిఫ్రిజిరేటర్ గ్యాస్ పైపులు దెబ్బతిని లీకేజీలు ఏర్పడినా, ఫిల్టర్లలో ధూళి పేరుకుపోయి గాలి ప్రవాహం ఆగిపోయినా యూనిట్ తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయే ప్రమాదం ఉంది. నాణ్యత లేని వైరింగ్ వాడటం, విద్యుత్ సరఫరాలో అకస్మాత్తుగా వచ్చే వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల షార్ట్ సర్క్యూట్‌లు సంభవించి అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏసీ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏడాదికి కనీసం రెండుసార్లు నిపుణులైన టెక్నీషియన్లతో సర్వీసింగ్ చేయించుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీని గంటల తరబడి నిరంతరం వాడకుండా మధ్యలో తగినంత విరామం ఇవ్వడం వల్ల కంప్రెసర్‌పై భారం తగ్గుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి రక్షణ కోసం నాణ్యమైన స్టెబిలైజర్‌ను, ప్రత్యేక పవర్ సాకెట్‌ను ఉపయోగించాలి. ఏసీ యూనిట్ చుట్టూ గాలి ఆడేలా కనీసం రెండు అడుగుల స్థలం వదలాలని, ఏసీ నుంచి వాసనలు లేదా శబ్దాలు వస్తే వెంటనే వాడకం ఆపేసి, తనిఖీ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.


