లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాణాన్ని వైఎస్సార్సీపీ పార్టీ వ్యతిరేకిస్తుందని పార్టీ ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. ఈరోజు (బుధవారం) పార్లమెంటులో స్పీకర్ ఓంబిర్లాపై జరిగిన అవిశ్వాస తీర్మాన చర్చలో పార్టీ తరపున ఆయన పాల్గొన్నారు. తాము ఎన్డీఏతో సహా ఎవరి మిత్రపక్షం కాదని అయితే దేశ అత్యున్నత పదవిలో ఒకటైన స్పీకర్ పదవికి ఉన్న గౌరవం కాపాడాలనే తమ పార్టీ అభిమతం అని తెలిపారు. ప్రజలకు మేలు కలిగే ఏ అంశాలు చేపట్టినా ప్రభుత్వానికి మద్ధతిస్తామని పార్లమెంటు సజావుగా జరగాలంటే అందరూ సహకరించాలని కోరారు.
ఏపీకి సంబంధించిన అనేక సమస్యలపై చర్చించేందుకు స్పీకర్ తమకు సమయం ఇచ్చారని అందుకు కృతజ్ఞతలని ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి అన్నారు. కాగా నిన్న మంగళవారం పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి ప్రసంగంలో రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతించకపోవడం, 8మంది కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం, విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేయడం తదితర కారణాలతో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి మద్దతుగా 118 మంది ఎంపీలు సంతకం చేశారు.


