ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధ్యక్షురాలు ఖలీదా జియా కన్నుమూశారు. 80 ఏళ్ల వయసున్న ఆమె ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తనువు చాలించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆమె నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరారు.
Reuters reports, Bangladesh's first female Prime Minister, Khaleda Zia, dies at 80.
— ANI (@ANI) December 30, 2025
గత కొంతకాలంగా ఖలీదా జియా గుండె, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆమె దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె దీర్ఘకాలంగా మధుమేహం, ఆర్థరైటిస్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా సోకిన ఛాతీ ఇన్ఫెక్షన్ ఆమె శ్వాసక్రియపై తీవ్ర ప్రభావం చూపింది. వైద్యుల నివేదిక ప్రకారం ఆమె గుండె పనితీరు కూడా మందగించింది. దీంతో ఆమెను అత్యవసరంగా కోరోనరీ కేర్ యూనిట్ (ససీయూ) నుండి వెంటిలేటర్‌కు తరలించారు. ఆమె వ్యక్తిగత వైద్య బృందం, అంతర్జాతీయ నిపుణులు కలిసి ఆమెకు మెరుగైన వైద్యం అందించారు.
ఖలీదా జియా మృతిపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆమె మంగళవారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచినట్లు తెలిపింది. ‘బీఎన్‌పీ చైర్‌పర్సన్, మాజీ ప్రధాని, జాతీయ నాయకురాలు బేగం ఖలీదా జియా ఈరోజు ఉదయం 6:00 గంటలకు ప్రార్థనల తర్వాత మరణించారు’ అని పార్టీ ఆ ప్రకటనలో తెలిపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని పేర్కొంది. బీఎన్‌పీ మీడియా సెల్ కూడా ఫేస్‌బుక్‌లో ‘మా ప్రియమైన జాతీయ నాయకురాలు బేగం ఖలీదా జియా ఇప్పుడు మాతో లేరు. ఆమె ఈరోజు ఉదయం 6 గంటలకు మరణించారు’ అని పోస్ట్ చేసింది.
ఖలీదా జియా ప్రస్థానం.. భారత్‌తో బంధం
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)అధ్యక్షురాలిగా సుదీర్ఘ కాలం సేవలందించారు. 1945లో అవిభక్త భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి జిల్లాలో జన్మించిన ఖలీదా జియాకు భారత్‌తో సంబంధం ఉంది. ఆమె భర్త, దివంగత అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పలు పోరాటాలు చేశారు.
ఖలీదా జియా పదవీకాలంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఆమె పార్టీ బీఎన్‌పీని భారత్ వ్యతిరేకిగా కొందరు పరిగణించినప్పటికీ, ఆమె ఎప్పుడూ ఆ వాదనలను ఖండించారు. ఇటీవల ఆమె భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో, తమ పార్టీ భారత్‌కు వ్యతిరేకం కాదని, కేవలం వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. జల్పైగురిలో జన్మించిన ఆమెకు భారతీయ సంస్కృతి, ప్రాంతీయ సంబంధాలపై ప్రత్యేక గౌరవం ఉంది. 1991లో మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ తర్వాత 2001లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా ఆమె పలు అవినీతి ఆరోపణలు, జైలు శిక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవి భారత్‌తో దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపాయి.
ఇది కూడా చదవండి: Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి


