డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుదెబ్బ  | Donald Trump Faces Rebellion In Own Party Over Canada Tariffs, House Passes Resolution Against Policy | Sakshi
Sakshi News home page

డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుదెబ్బ 

Feb 13 2026 4:38 AM | Updated on Feb 13 2026 11:45 AM

Republicans Break Ranks With Trump Over Canada Tariffs

ప్రతినిధుల సభలో కెనడాపై టారిఫ్‌లను ఖండిస్తూ డెమొక్రాట్ల తీర్మానం  

తీర్మానానికి అనుకూలంగా 219, వ్యతిరేకంగా 211 ఓట్లు  

ట్రంప్‌ తీరును తప్పుపట్టిన ఆరుగురు రిపబ్లికన్‌ సభ్యులు  

వాషింగ్టన్‌: విచ్చలవిడిగా టారిఫ్‌ల బాదుడుతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెనడాపై టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌ దూకుడును సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తానని ఆయన ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి కెనడా ఉత్సాహం చూపుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా కెనడా ప్రధానమంత్రి మార్క్‌ కార్నీ, ట్రంప్‌ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. మాటల యుద్ధం సాగుతోంది. మొత్తానికి అమెరికా, కెనడా మధ్య చిచ్చు మొదలైంది. కెనడాపై గత ఏడాది 35 శాతం సుంకాలు విధించారు. మరిన్ని సుంకాలకు సిద్ధమవుతున్నారు. కెనడాపై టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌ ప్రతిపాదనను ఖండిస్తూ విపక్ష డెమొక్రటిక్‌ సభ్యులు అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. 

దీనిపై బుధవారం ఓటింగ్‌ జరిగింది. తీర్మానానికి అనుకూలంగా 219 మంది, వ్యతిరేకంగా 211 మంది ఓటు వేశారు. తీర్మానం నెగ్గింది. ఆరుగురు రిపబ్లికన్‌ సభ్యులు తీర్మానానికి మద్దతు పలికారు. అంటే ట్రంప్‌కు సొంత పార్టీ నుంచే చుక్కెదురైంది. ఈ తీర్మానంపై త్వరలో సెనేట్‌లో ఓటింగ్‌ జరుగనుంది. ఒకవేళ సెనేట్‌లో కూడా ఆమోదం పొందినప్పటికీ ట్రంప్‌ తన అధికార బలంతో వీటో చేస్తారనడంలో సందేహం లేదు. ట్రంప్‌ టారిఫ్‌ల విధానం స్వదేశంలోనే చాలామందికి నచ్చడం లేదు. వాణిజ్య ఒప్పందాల విషయంలో టారిఫ్‌లను ట్రంప్‌ ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. 

తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికిగాను చర్చలకు రాకపోతే టారిఫ్‌ లు పెంచేస్తానని బెదిరిస్తున్నారు. మరోవైపు విదేశీ ఉత్పత్తులపై సుంకాల బాదుడు వల్ల అమెరికాలో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతోంది. అది చట్టసభ సభ్యులపై ఒత్తిడిని పెంచుతోంది. ట్రంప్‌ మొండితనం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, ప్రజలపై భారం పడుతోందని వారు విమర్శిస్తున్నారు. ట్రంప్‌ వల్ల రాజకీయంగా నష్టపోతున్నామన్న ఆందోళన ఆయన పార్టీ నేతల్లో నెలకొంది.  

ట్రంప్‌ హెచ్చరికలు  
సొంత పార్టీ నేతలకు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశా రు. తన విధానాలను వ్యతిరేకిస్తే తీవ్ర పరిణా మాలు ఉంటాయన్నారు. కెనడాపై టారిఫ్‌ల విషయంలో ప్రతినిధుల సభలో విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు మద్దతివ్వడంపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement