Bangladesh: ఉత్కంఠ మధ్య కొనసాగుతున్న పోలింగ్ | Bangladesh Holds General Elections 2026 Under Tight Security Amid Political Transition, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Bangladesh: ఉత్కంఠ మధ్య కొనసాగుతున్న పోలింగ్

Feb 12 2026 9:58 AM | Updated on Feb 12 2026 10:06 AM

Bangladesh election 2026 voters lead participation

ఢాకా: బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రారంభమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడం, విపక్ష నేత ఖలీదా జియా మృతి తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా 299 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. నోబెల్ విజేత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం  ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల కోసం వివిధ ప్రాంతాల్లో మోహరించారు.

ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)తరఫున ప్రధాని రేసులో ముందున్న తారిఖ్ రెహమాన్ ఢాకాలోని గుల్షన్ మోడల్ స్కూల్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం తర్వాత గత ఏడాది డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగొచ్చిన ఆయన, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతమే తమ లక్ష్యమని అన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీకి దూరంగా ఉన్న నేపథ్యంలో, బీఎన్‌పీకి భారీ విజయావకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇస్లామిక్ జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమి నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవుతోంది.

ఈ ఎన్నికలను ప్రపంచంలోనే మొట్టమొదటి ‘జెన్-జీ’ ప్రేరిత ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. 2024లో షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థి నాయకులు ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తం ఓటర్లలో నాలుగో వంతు మంది యువత ఉండటం విశేషం. ముఖ్యంగా ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరుతో విద్యార్థి నాయకులు జమాతే ఇస్లామీతో చేతులు కలిపి ఎన్నికల బరిలోకి దిగారు. దేశంలో అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం యువత పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు  ఉత్నాహం చూపిస్తున్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఈ ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా విమర్శించారు. తన పార్టీని అనుమతించకుండా జరుగుతున్న ఈ ఎన్నికలు దేశంలో అస్థిరతకు దారితీస్తాయని ఆమె  అన్నారు. హసీనాకు కంచుకోటగా భావించే గోపాల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో ఓటర్ల రాక చాలా తక్కువగా కనిపిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement