Bangladesh: హిందూ వ్యాపారి దారుణ హత్య | Hindu Businessman Hacked To Death In Bangladesh Ahead Of Elections, More Details Inside | Sakshi
Sakshi News home page

Bangladesh: హిందూ వ్యాపారి దారుణ హత్య

Feb 11 2026 10:00 AM | Updated on Feb 11 2026 10:21 AM

Hindu Businessman Hacked To Death In Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మొయ్‌మన్‌సింగ్‌ జిల్లాలో సుషేన్ చంద్ర సర్కార్ (62) అనే బియ్యం వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. దుండగులు సర్కార్‌ను పదునైన ఆయుధంతో నరికి చంపి, మృతదేహాన్ని షాపులోనే వదిలేసి, నగదు తీసుకుని, షట్టర్లు వేసి పరారయ్యారు. బాధితుడు దక్షిణ్‌కాండ గ్రామానికి చెందినవాడని, స్థానిక బోగర్ బజార్ జంక్షన్‌లో ‘భాయ్ భాయ్ ఎంటర్‌ప్రైజ్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

తండ్రి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుమారుడు సుజన్ సర్కార్ షాపు వద్దకు వెళ్లి చూడగా, సుషేన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆయనను మొయ్‌మన్‌సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హత్య అనంతరం దుండగులు షాపులో ఉన్న లక్షలాది రూపాయలను ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, కేవలం దోపిడీ కోసమే ఇంతటి దారుణానికి ఒడిగట్టారని వారు అంటున్నారు.

బంగ్లాదేశ్‌లో గతంలో దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని కూడా అత్యంత దారుణంగా కొట్టి, నిప్పంటించి చంపిన ఉదంతం చోటుచేసుకుంది. 2024 ఆగస్టులో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మైనారిటీలపై దాడులు గణనీయంగా పెరిగాయి. ఆలయాల ధ్వంసం, ఆస్తుల కబ్జా లాంటి  2,900 హింసాత్మక ఘటనలు నమోదైనట్లు అంతర్జాతీయ నివేదికలు  చెబుతున్నాయి. కాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, అల్పసంఖ్యాక వర్గాలకు తగిన రక్షణ కల్పించాలని ఢాకా ప్రభుత్వాన్ని భారత్ కోరింది.
 

Advertisement
 
Advertisement
Advertisement