థాయిలాండ్‌లో ఓ ఆగంతకుని దుశ్చర్చ
హాట్ యాయ్: పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న ఓ ఆగంతకుడు సమీప స్కూల్‌లోకి చొరబడి గన్‌తో అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులను బెదిరించి అందర్నీ బంధించిన ఉదంతం థాయిలాండ్‌లో జరిగింది. విషయం తెల్సి రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు రెండు గంటలపాటు శ్రమించి ఎలాగోలా అందర్నీ క్షేమంగా విడుదలచేశారు. అయితే ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి గాయపడ్డాడు.
రెండు గంటలపాటు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ ఘటన ఎట్టకేలకు సుఖాంతంకావడంతో పోలీసులు, స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. దక్షిణ థాయిలాండ్‌లోని హాట్ యాయ్ జిల్లాలోని సోంగ్‌ఖ్లా పట్టణంలోని ఫటోంగ్ ప్రథాన్ ఖిరివాట్ స్కూల్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రెండు గంటలపాటు అందర్నీ తన బందీలుగా మార్చుకున్న 19 ఏళ్ల ఆగంతకుడిని ఖేమ్నన్‌గా పోలీసులు గుర్తించారు.
స్కూల్‌లో తన సోదరికి పాఠాలు చెప్పిన ఒక టీచర్‌ను లక్ష్యంగా చేసుకుని పాఠశాలలోకి ఖేమ్నన్ చొరబడ్డాడని స్థానికులు ఆరోపించారు. ఖేమ్నన్‌కు పాఠశాలకు మధ్య నెలకొన్న వివాదం ఏమిటన్నది తెలియరాలేదు. స్కూల్లో పలుమార్లు కాల్పుల శబ్దాలు విన్పించాయని, పలువురు గాయపడ్డారని తొలుత వచ్చిన వార్తలను థాయిలాండ్ ప్రభుత్వం ఖండించింది. థాయిలాండ్‌లో తుపాకీల సంస్కృతి ఎప్పట్నుంచో ఉంది. ఇక్కడి జనాభాలో చాలా మందికి గన్‌లను కొనుగోలుచేసే అలవాటు ఉంది. వ్యక్తిగత మనస్పర్ధలతో తుపాకీల మోతలు మోగుతాయిగానీ గుమిగూడిన జనాలపై సామూహికంగా కాల్పుల ఘటనలు అత్యంత అరుదు.


