అక్రమ ఓటర్ల వివరాలివ్వండి | High Court orders petitioner on Jubilee Hills Society elections | Sakshi
Sakshi News home page

అక్రమ ఓటర్ల వివరాలివ్వండి

Feb 12 2026 4:13 AM | Updated on Feb 12 2026 4:13 AM

High Court orders petitioner on Jubilee Hills Society elections

జూబ్లీహిల్స్‌ సొసైటీ ఎన్నికలపై పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం 

రవీంద్రనాథ్‌పై రిజిస్ట్రార్ చర్యలు తీసుకోలేదంటూ మరో పిటిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలకు సంబంధించి అక్రమ ఓటర్లుంటే.. ఆ వివరాలు సమర్పించాలని ధిక్కరణ కేసులో పిటిషనర్‌ జ్యోతిప్రసాద్‌ కోసరాజును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ‘కోఆపరేటివ్‌ చట్టంలోని సెక్షన్‌ 19 ప్రకారం స్థలాలు ఉంటేనే కొత్త సభ్యులను చేర్చుకోవాలి. స్థలాలు పొందని సభ్యుల సంఖ్య ఎప్పుడూ 10 శాతానికి మించ కూడదు. అలాగే మంచిరేవులలో జూబ్లీహిల్స్‌ ఫేజ్‌–4 పేరుతో సొసైటీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరతీసింది. 

కొత్త సభ్యులుగా చేరే వారు రూ.5 లక్షలు చెల్లించి ఫ్లాట్‌ బుక్‌ చేసుకోవాలని షరతు విధించింది. ఓ ప్రైవేట్‌ వెంచర్‌ వారితో ఒప్పందం కుదుర్చుకుంది. సొసైటీ పరిధిలోనే భూములు ఇవ్వాలి గానీ, పరిధిలేని ప్రాంతాల్లో ‘ప్రైవేట్‌’తో ఒప్పందం చట్టవిరుద్ధం. ఈ అక్రమాలపై కోఆపరేటివ్‌ సొసైటీస్‌ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదు’అంటూ 2024లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొత్త సభ్యత్వాల ప్రక్రియపై ముందుకు వెళ్లవద్దని, వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. 

జూబ్లీహిల్స్‌–4 పేరిట నిర్వహిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార ఒప్పందాన్ని కూడా ఆపేయాలని చెప్పారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లుగా ‘మంచిరేవుల’సభ్యులకు అవకాశం ఇచ్చారంటూ సొసైటీ సభ్యులు జ్యోతిప్రసాద్‌ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ టి.మాధవీదేవి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ప్రతివాదులు సహకార శాఖ కమిషనర్‌ సురేంద్రమోహన్, జూబ్లీహిల్స్‌ సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్‌ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు. కొత్త సభ్యులను చేర్చి.. వారికి ఎన్నికల్లో ఓటు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆ ఇద్దరిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలి’అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కొత్త ఓటర్ల వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించారు.  

రవీంద్రనాథ్‌పై చర్యలేవీ? 
జూబ్లీహిల్స్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ రవీంద్రనాథ్‌పై ఆరు వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోఆపరేటివ్‌ రిజి్రస్టార్‌ను హైకోర్టు ఆదేశించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ మరో ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. సొసైటీ సభ్యులు జ్యోతిప్రసాద్, విజయభాస్కర్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లోనూ విచారణను న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. 

రవీంద్రనాథ్‌పై అనర్హత వేటు వేయాలంటూ తాము 2024, అక్టోబర్‌ 26న ఇచ్చిన వినతిపత్రంపై రిజిస్ట్రార్ చర్యలు తీసుకోవడం లేదంటూ అదే ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. సొసైటీ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి, రవీంద్రనాథ్‌పై చర్యలు తీసుకోవాలని రిజి్రస్టార్‌ను ఆదేశించారు. అయినా చర్యలు తీసుకోలేదంటూ ఈ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement