జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరిగా విభజన
3 కార్పొరేషన్లకూ స్పెషల్ ఆఫీసర్‌గా జయేశ్‌రంజన్
కమిషనర్లుగా కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి,జి.సృజన బాధ్యతల స్వీకారం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ముఖచిత్రం మారింది. ఇటీవలే 150 వార్డుల నుంచి 300 వార్డులకు విస్తరించిన జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీ క్యూర్) వరకు (ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతం) విస్తరించి ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులతో ఉన్న జీహెచ్‌ఎంసీని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా విభజించింది.
ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఏయే జోన్లు వస్తాయో ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు ఏర్పాటుచేసిన ఈ కార్పొరేషన్లు వేటికవే ప్రత్యేక సంస్థ హోదాతో పనిచేస్తాయి. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ జీవో (నంబర్ 55) విడుదల చేశారు. గెజిట్ నోటిఫికేషన్‌కు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు లక్ష్యంగా విభజన చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
జయేశ్‌రంజన్‌కు పర్యవేక్షణ బాధ్యతలు
ఈ మూడు కార్పొరేషన్ల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు స్పెషలాఫీసర్‌గా జయేశ్‌రంజన్‌ను నియమించారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరులో ఐదు కార్పొరేషన్లకు ఉమ్మడిగా ఒక చీఫ్ కమిషనర్ ఉండటం గమనార్హం. కాగా బుధవారం తెల్లవారేసరికే కార్పొరేషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకాల జీవోలు కనిపించడంతో 8 గంటలకు అటూఇటూగా సంబంధిత అధికారులు బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ ఆఫీసర్‌గా జయేశ్‌రంజన్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం మొదటి అంతస్తులో మేయర్ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.
తార్నాకలో ఏర్పాటైన మల్కాజిగిరి కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, న్యాక్‌లోని సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో జి.సృజన కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. పరిధి మారడంతో ఆర్‌వీ కర్ణన్ సైతం మరోమారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా తన చాంబర్‌లోనే బాధ్యతలు స్వీకరించారు. వీరితోపాటు ఆయా కార్యాలయాల్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులు బాధ్యతలు స్వీకరించగా, బదిలీ అయిన సిబ్బంది విధుల్లో చేరారు. కాగా సీఎస్ రామకృష్ణారావును ఆర్‌వీ కర్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
మూడు వెబ్‌సైట్లు..త్వరలో టీ క్యూర్ యాప్
మూడు కార్పొరేషన్లకు వేర్వేరుగా వెబ్‌సైట్లను సైతం రూపొందించారు. ప్రజా ఫిర్యాదుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న‘మై జీహెచ్‌ఎంసీ యాప్’స్థానే ‘టీ క్యూర్’యాప్ అందుబాటులోకి రానుంది.
వికేంద్రీకరణతో ప్రజలకు మేలు
అధికార వికేంద్రీకరణ, ప్రజలకు సత్వర సేవలు లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా తొలుత మండల వ్యవస్థ ప్రవేశపెట్టారు. అనంతర కాలంలో ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారు. చిన్న పంచాయతీలనూ ప్రజలు ఆమోదించారు. వికేంద్రీకరణ ప్రజలకు సౌలభ్యంగా, సౌకర్యంగా ఉంటుంది.
– జయేష్‌రంజన్, స్పెషలాఫీసర్
మూడు కార్పొరేషన్లు ఇలా..
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్: ఐటీ కారిడార్‌ను కలుపుతూ శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్: మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్ జోన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్: జీహెచ్‌ఎంసీ పేరును కొనసాగిస్తూ ..సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో లేని మిగతా ఆరు జోన్లు (శంషాబాద్, రాజేంద్రనగర్, చారి్మనార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్). 



