హైస్పీడ్‌ రైల్‌ కోసం భూసార పరీక్షలు | Soil tests for high speed rail | Sakshi
Sakshi News home page

హైస్పీడ్‌ రైల్‌ కోసం భూసార పరీక్షలు

Feb 12 2026 4:09 AM | Updated on Feb 12 2026 4:09 AM

Soil tests for high speed rail

రైతుల నుంచి అభ్యంతరాలు రాకుండా చూడాలని తహసీల్దార్‌కు వినతి 

యాచారం: ఫ్యూచర్‌ సిటీ నుంచి చెన్నైకి ప్రతిపాదించిన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణం కోసం రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఫ్యూచర్‌ సిటీ నుంచి బెంగళూరు, ఫ్యూచర్‌ సిటీ నుంచి చెన్నై మధ్య హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం డీపీఆర్‌ తయారీ, ట్రాఫిక్‌ సర్వే నివేదిక రూపొందించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను రైట్స్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించింది. 

ఇందులో భాగంగా సంస్థ ఇంజనీర్ల బృందం ఫ్యూచర్‌సిటీ పరిధిలోని కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, తక్కళ్లపల్లి, చింతపట్ల గ్రామాల మీదుగా ప్రణాళికాబద్ధమైన రైలు మార్గం అమరిక, జియోటెక్నికల్‌ పరిశోధనల కోసం 60 అడుగుల లోతు వరకు బోర్‌హోల్స్‌ను తవ్వి భూసార పరీక్షలు చేపట్టారు. ఆధునిక యంత్రాలను ఉపయోగించి భూగర్భ పరిస్థితులను అంచనా వేయడం, సురక్షిత కారిడార్, నమ్మకమైన డిజైన్‌ను నిర్ధారించడానికి ప్రతీ రెండు నుంచి ఐదు కిలోమీటర్ల మధ్య రెండు లేదా మూడు బోర్‌హోల్స్‌ తవ్వి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఆటంకం కలిగించొద్దు 
రైట్స్‌ సంస్థ ప్రతినిధి శైలేంద్ర పాండే బుధవారం యాచారం తహసీల్దార్‌ అయ్యప్పను కలిశారు. బోర్‌హోల్స్‌ తవ్వకాల్లో స్థానికుల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని తహసీల్దార్‌ను కోరారు. కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల్లోని వ్యవసాయ భూముల మీదుగా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ మార్గం ఉండనుంది. 

జియోటెక్నికల్‌ సర్వే పనులు సజావుగా జరిగేలా, రైతుల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా సహకరించాలని తహసీల్దార్‌ను కోరారు. దీంతో అయ్యప్ప ఆయా గ్రామాల సర్పంచ్‌లకు ఫోన్‌ చేసి భూసార పరీక్షలు జరిపే బోర్‌హోల్స్‌ తవ్వకాలకు ఆటంకం కలిగించొద్దని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement