మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోయపల్లి జెడ్పీహెచ్‌స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు బారులుతీరిన మహిళలు , సీల్ వేసిన బ్యాలెట్ బాక్సును బుధవారం రాత్రి మహబూబాబాద్‌లోని స్ట్రాంగ్ రూమ్‌కు తీసుకెళ్తున్న సిబ్బంది
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
116 మున్సిపాలిటీల్లో 75.88% పోలింగ్ నమోదు
7 మున్సిపల్ కార్పొరేషన్లలో 66.05 % ఓటింగ్
మున్సిపాలిటీల్లో అత్యధికంగా చౌటుప్పల్‌లో,అత్యల్పంగా నందికొండలో..
కార్పొరేషన్లలో నల్లగొండ టాప్.. నిజామాబాద్ లాస్ట్
సంగారెడ్డి, నిజామాబాద్ ఘటనలపై నివేదిక కోరిన ఎన్నికల సంఘం!..
రేపు ఓట్ల లెక్కింపు.. తొలిసారిగా టేబుళ్ల చుట్టూ ఫెన్సింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు బుధవారం జరిగిన సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 123 పురపాలక సంఘాలకు కలిపి 73.01 శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 66.05 శాతం, మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వర్గాలు ప్రకటించాయి. మున్సిపాలిటీల్లో అత్యధికంగా చౌటుప్పల్‌లో 91.91 శాతం ఓట్లు పోలవగా, అత్యల్పంగా నందికొండలో 59.68 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. కార్పొరేషన్ల విషయానికొస్తే నల్లగొండలో అత్యధికంగా (77.36%), నిజామాబాద్‌లో అత్యల్పంగా (59.12%) పోలింగ్ జరిగింది.
చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఎక్కడా రీపోలింగ్ అవసరం ఏర్పడలేదని వెల్లడించాయి. అయితే నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, సంగారెడ్డిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులను దూషించినట్లు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. ఈ రెండు ఘటనలపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సంబంధిత జిల్లా ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఫిర్యాదులుంటే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని..ఎస్‌ఈసీ కార్యదర్శి లింగ్యానాయక్, డీజీపీ శివధర్‌రెడ్డి, పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, ఇతర అధికారులతో కలిసి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పరిస్థితులను, బందోబస్తు ఏర్పాట్లను కమ్యూనికేషన్ సాధనాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. రూట్ మొబైల్ ఫోర్స్, స్రైకింగ్ పోర్స్, స్పెషల్ స్రైకింగ్ ఫోర్స్ కదలికలను గూగుల్ మ్యాపింగ్‌కు అనుసంధానం చేసి రియల్ టైమ్ మానిటరింగ్ చేశారు. 
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి కూడా వారితో కలిసి వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. వెబ్‌కాస్టింగ్ ఎన్నికల ప్రక్రియపై యువతలో అవగాహన పెంచడంతో పాటు ఓటర్లలో ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని, తద్వారా ఓటరు శాతం పెరుగుదలకు ఇది సహకరిస్తుందని కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు జనరల్ అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపారు. ఇలావుండగా పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లు, సౌకర్యాల లోపంపై అక్కడక్కడా ఫిర్యాదులు అందాయి. 
రిసీవింగ్ సెంటర్లకు బ్యాలెట్ బాక్సులు
పోలింగ్ ముగిసిన తర్వాత సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లు తీసుకుని 123 పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసిన రిసీవింగ్ సెంటర్లకు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు సురక్షితంగా చేర్చడంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 
పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న రాణీకుముదిని, డీజీపీ శివధర్‌రెడ్డి
ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు
ఈ నెల 13న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తొలిసారిగా టేబుళ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం రాత్రి వరకు కొనసాగే అవకాశముంది.


