సాక్షి,హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, ఈనెల 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది.
ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్ టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 14నుంచి 16తేది వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15 వతేది నుంచి 17 తేది వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్ లను సంస్థ ఏర్పాటు చేస్తుంది.
శివరాత్రి ఆపరేషన్స్‌పై ఉన్నతాధికారులతో సంస్థ విసి అండ్ ఎండీ ఐపీఎస్ వై.నాగిరెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. శివరాత్రి పండుగకు శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తోంది. 43 శైవ క్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత శివరాత్రి కన్నా ఈ సారి 208 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని,టికెట్ల బుకింగ్ మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000,040-234500332లలో సంప్రదించవచ్చని తెలిపారు.


