హైదరాబాద్‌ నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది | Telangana Three Municipal Corporations | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది

Feb 11 2026 9:17 AM | Updated on Feb 11 2026 9:20 AM

Telangana Three Municipal Corporations

నగర చరిత్రలో ముగిసిందొక అధ్యాయం  

రూపురేఖలు మారిన జీహెచ్‌ఎంసీ  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. 2007 ఏప్రిల్‌ 16న శివార్లలోని 12 మున్సిపాలిటీల  విలీనంతో 150 వార్డులుగా ఏర్పాటైన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) రూపురేఖలు బుధవారం (2026 ఫిబ్రవరి11) నుంచి మారిపోతున్నాయి. జీహెచ్‌ఎంసీగానే 300 వార్డులకు విస్తరించి మహా కార్పొరేషన్‌గా అవతరించిన జీహెచ్‌ఎంసీ.. తిరిగి 150 వార్డులతోనే అయినప్పటికీ కొత్త రూపుతో కనిపించనుంది. అటు తొర్రూరు నుంచి ఇటు అడ్డగుట్ట దాకా విస్తరించినప్పటికీ, వనస్థలిపురం, పెద్దఅంబర్‌పేట, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాలను వదులుకోవాల్సి వచ్చింది. అవి కొత్తగా ఏర్పాటైన రెండు కార్పొరేషన్లలో కనిపించనున్నాయి. 5 జోన్లుగా అవతరించిన జీహెచ్‌ఎంసీ అనంతరం 6 జోన్లుగా మారింది. తిరిగి 12 జోన్లకు విస్తరించిన పరిధి మళ్లీ  6 జోన్లకు పరిమితమైంది. 

అలా.. మారిన నగరం.. అభివృద్ధి ఘనం.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడిన జీహెచ్‌ఎంసీ.. తిరిగి కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే రూపురేఖలు మార్చుకుంది. గడచిన పుష్కర కాలంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎన్నో పనులు జరిగాయి. విదేశాలను తలపించేలా బహుళ అంతస్తుల భవనాలు, ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం), ఎస్‌ఎన్‌డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం) కింద వేల కోట్ల పనులు జరిగాయి. దాదాపు రూ.24వేల కోట్లతో 23 ఫ్లై ఓవర్లతో సహ దాదాపు 40 ప్రాజెక్టుల పనులు జరిగాయి. బాండ్ల ద్వారానూ రుణాలు సేకరించిన కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ పేరు తెచ్చుకుంది. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, పార్కుల ఏర్పాటు, పచ్చదనం, సుందరీకరణ వంటి పనులు జరిగాయి. నిర్వహణ తీరెలా ఉన్నా ఎల్‌ఈడీ స్ట్రీట్‌లైట్స్‌ వంటివి ఏర్పాటు చేశారు. దేశంలోని అగ్రనగరాలతో పోటీ పడుతూ నగరం ఎదిగేలా జీహెచ్‌ఎంసీ తనవంతు పాత్ర నిర్వహించింది.   

Advertisement
 
Advertisement
Advertisement