బల్దియాకు కొత్త రూపు.. | IAS Transfers In Telangana | Sakshi
Sakshi News home page

బల్దియాకు కొత్త రూపు..

Feb 11 2026 7:45 AM | Updated on Feb 11 2026 1:33 PM

IAS Transfers In Telangana

కొనసాగనున్న ‘ప్రత్యేక’ పాలన  

పాలకమండలి ఎన్నికలయ్యే దాకా..  

మూడు కార్పొరేషన్లుగా విభజన 

నేడు స్పెషలాఫీసర్ల నియామక జీవోలు  

బాధ్యతలు చేపట్టనున్న కమిషనర్లు 

సైబరాబాద్‌కు సృజన, మల్కాజిగిరికి వినయ్‌కృష్ణారెడ్డి, జీహెచ్‌ఎంసీకి కర్ణన్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో స్థానిక పరిపాలన మారనుంది. బుధవారం నుంచి నూతన రూపు రానుంది. కొత్త ఊపుతో కొత్త అధికారులు పరిపాలన సాగించనున్నారు. ఈమేరకు ప్రభుత్వం వారిని సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీ 150 వార్డులుగా ఉన్నప్పుడు ఎన్నికైన పాలక మండలి గడువు మంగళవారంతో ముగిసిపోవడంతో కొత్త పాలన ప్రారంభం కానుంది. జీహెచ్‌ఎంసీ వార్డుల్ని 150 నుంచి 300కు పెంచిన ప్రభుత్వం మూడు కార్పొరేషన్ల విభజన, స్పెషల్‌ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన జీవోలను బుధవారం జారీ చేయనుంది. ఆ వెంటనే కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. జీహెచ్‌ఎంసీ 150 వార్డులతోనే ఉండనున్నప్పటికీ, ప్రాంతాలు, వార్డుల్లో మార్పులు చేర్పులుంటాయి. కొత్తగా సైబరాబాద్‌  కార్పొరేషన్‌ 76, మల్కాజిగిరి కార్పొరేషన్‌ 74 వార్డులతో ఏర్పాటు కానున్నాయి. సైబరాబాద్‌ కమిషనర్‌గా సృజన, మల్కాజిగిరి కమిషనర్‌గా వినయ్‌కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కర్ణన్‌ కొనసాగుతారు.  

జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ మేరకే.. 
కొత్త కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీ యాక్ట్, నిబంధనల మేరకే ఏర్పాటు చేస్తున్నందున.. ఈ పరిధిలో అమలయ్యే విధానాలే అనుసరిస్తారు. నగరంలో ఉండే మూడు కార్పొరేషన్లు పరస్పర సమన్వయంతో పని చేయనున్నాయి. మూడు కార్పొరేషన్లు, ముగ్గురు కమిషనర్లు స్వతంత్రంగానే పని చేయనున్నప్పటికీ, యూనిఫామ్‌గా పనులు జరగనున్నాయి. మూడు కార్పొరేషన్లకు స్పెషల్‌ ఆఫీసర్‌గా నియామకం కానున్న మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ సూపర్‌బాస్‌గా వ్యవహరించనున్నారు. ఆస్తిపన్ను విధింపు విధానాలు, రేట్లు  మూడు కార్పొరేషన్లలో ఒకే మాదిరిగా ఉంటాయి.  

ఎన్నికల దాకా.. 
కొత్త అధికారులు మూడు కార్పొరేషన్లకు పాలకమండళ్ల ఎన్నికలు జరిగేంత దాకా వివిధ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వనున్నారు. పౌరసేవల్లో గణనీయమైన మార్పులు రానున్నాయి. వీలైనన్ని పనుల్ని  ప్రజలు కార్యాలయాల దాకా రాకుండా ఆన్‌లైన్‌ ద్వారానే జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణ, తదితర పనులు సైతం ఒకేవిధంగా ఉంటాయి. దోమల నివారణ విభాగంలో ప్రస్తుతం సర్కిల్‌కు ఒక అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌ ఉండగా, ఇకనుంచి అన్ని కార్పొరేషన్లలో కూడా రెండు వార్డులకు ఒకరు, పెద్ద వార్డులకైతే ఒకే వార్డుకు ఒకరు చొప్పున వార్డు ఎంటమాలజీ సూపర్‌వైజర్లుంటారు.  

పదంతస్తుల వరకు మాత్రమే అనుమతులు 
భవన నిర్మాణాలకు సంబంధించి 30 మీటర్ల ఎత్తు (పదంతస్తుల) వరకు ఆయా కార్పొరేషన్లే అనుమతులివ్వనుండగా, అంతకు మించిన భవనాలకు  అనుమతుల అధికారం హెచ్‌ఎండీఏకు ఉంటుంది. నిర్మాణ అనుమతుల ఫీజుల్లో 5 నుంచి 10 శాతం వరకు సొమ్మును జీహెచ్‌ఎంసీ వాటాగా  బదలాయించాల్సి ఉంటుందని సమాచారం. రోడ్ల నిర్వహణ కోసం ఈ మొత్తం బదలాయించనున్నారు.  

కొట్టు.. కొట్టు.. కొబ్బరి కాయ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువుకు చివరి రోజైన మంగళవారం నగర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్, డిప్యూటీ మేయర్‌ సహా కార్పొరేటర్లు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. ఐదేళ్లలో చివరి రోజుల్లో మాత్రమే కార్పొరేటర్‌ ఫండ్‌ కేటాయించడంతో వీలైనన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్పొరేటర్‌ ఫండ్‌గా రూ. 2 కోట్లు ఇచ్చినప్పటికీ, రూ.కోటికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సిఫారసు కావాలనడంతో చాలామంది కేవలం రూ.కోటి పనులు మాత్రమే పొందగలిగారు. డివిజన్లలో బిజీబిజీగా గడిపారు.  

ఆఖరి.. ఆట విడుపు 
చాదర్‌ఘాట్‌లో ఆధునికీకరించిన విక్టోరియా ప్లేగ్రౌండ్‌ను స్థానిక కార్పొరేటర్‌తో కలిసి మేయర్‌ విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ కాసేపు క్రికెట్, వాలీబాల్‌ ఆడారు.

అప్పులపై ప్రభుత్వ సహకారం 
ఇప్పటి వరకు వివిధ ప్రాజెక్టుల కోసం జీహెచ్‌ఎంసీ చేసిన అప్పుల భారంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై చేయబోయే పనులకు ఏకార్పొరేషన్‌ పరిధిలోది ఆ కార్పొరేషన్‌ భరించాల్సి ఉంటుంది. పరిస్థితుల దృష్ట్యా కొంత కాలం వరకు ప్రభుత్వమే తగిన నిధుల్ని సమాకూర్చాల్సి ఉంటుంది.  

ఎవరి లెక్కలు వారివే.. 
ఏ కార్పొరేషన్‌ పరిధిలోని ఆదాయం, వ్యయం ఆ కార్పొరేషన్‌కే చెందుతాయి. ఇందుకుగాను వేటికవి బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నాయి. కార్పొరేషన్‌ ఏర్పాటు నుంచే సంబంధిత వార్డుల ఆస్తిపన్ను ఆదాయంతో పాటు ఆయా అంశాలకు సంబంధించిన ఫీజులు ఆ కార్పొరేషన్‌ ఖాతాలోనే జమ అవుతాయి. వచి్చన ఆదాయంలోంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement