కార్పొరేషన్‌ కహానీ | Elections are being held in 7 municipal corporations across the state | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ కహానీ

Feb 11 2026 4:29 AM | Updated on Feb 11 2026 4:29 AM

Elections are being held in 7 municipal corporations across the state

రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయిన జాబితాలో మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ఉన్నాయి. ఇక్కడ కార్పొరేషన్‌ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి.. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం గతం నుంచి 
కార్పొరేషన్లుగా కొనసాగుతున్నాయి. ఎంఐఎం కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండలో పోటీలో ఉంది. దీంతో ప్రధాన పార్టీల గెలుపోటములపై మజ్లిస్‌ ప్రభావం చూపనుంది.  

కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ మధ్యే ఫైట్‌ 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నీలగిరి కార్పొరేషన్‌పై మూడు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. అయితే గట్టి పోటీ మాత్రం కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్యే కొనసాగుతోంది. ఇటీవల కార్పొరేషన్‌గా మారిన నల్లగొండలో మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్య ర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు.  బీజేపీ మజ్లిస్‌ మూడో స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

బీజేపీ– కాంగ్రెస్‌ హోరాహోరీ 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యహోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక్కడ పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు లేవు. అయితే ఫలితాల అనంతరం మాత్రం పొత్తులు నెలకొనే పరిస్థితులు ఉంటాయనే అంచనా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ రానిపక్షంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య అవసరాన్ని బట్టి పొత్తులు కుదిరే అవకాశముంది.  

కమలం – హస్తం..
సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే ఉంది. అయితే కొన్ని డివిజన్ల పరిధిలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నడుమ త్రిముఖపోటీ నెలకొంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ, రెబెల్స్‌ మధ్య పోటీ ఉంది. ఎంఐఎం కూడా 15 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపింది. ఈ కార్పొరేషన్‌ పరిధిలో హంగ్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌  
గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్యనే ఉంది. ఇప్పటికే ఒక డివిజన్‌ ఏకగ్రీవం కాగా, అది కూడా కాంగ్రెస్‌కే దక్కింది. మెజారిటీ డివిజన్లలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులదే పైచేయిగా ఉంది. మొదటి సారిగా బీజేపీ అధిక డివిజన్లలో పోటీ చేస్తోంది.

‘గూడెం’లో కాంగ్రెస్‌ వర్సెస్‌ సీపీఐ 
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయ్యాక తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ వైరివర్గాలుగా మారి కొత్తగూడెంలో నువ్వా, నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, సీపీఎంతో జత కట్టి 58 డివిజన్ల నుంచి బరిలోకి దిగింది. సీపీఐ, టీడీపీతో పొత్తు కుదుర్చుకొని 57 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. రెండు పార్టీల రెబెల్స్‌పై ఆశలు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ చివరకు ఒంటరిగానే బరిలో నిలిచింది.  

మంచిర్యాలలో కాంగ్రెస్‌..బీఆర్‌ఎస్‌ మధ్యే  
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల కార్పొరేషన్‌లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య ఉండగా, పలు డివిజన్లలో బీజేపీ కూడా ప్రభావం చూపుతోంది. కార్పొరేషన్‌గా మారాక మొదటిసారి ఎన్నికలు జరుగుతుండడంతో మేయర్‌ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే ఉత్కంఠ రేపుతోంది. నగరంలో అన్నిపార్టీలకు బీసీల మద్దతే కీలకంగా మారింది. అన్ని పార్టీలు మహిళలకు రిజర్వు అయిన స్థానాలతో పాటు జనరల్‌ స్థానాల్లోనూ అధికంగా బీసీలకే బీఫాంలు ఇచ్చాయి.  

పాలమూరు.. త్రిముఖ పోరు  
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఇలాకా కావడం.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా పాలమూరు ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కొన్ని డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య, మరి కొన్నింటిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఎంఐఎం అభ్యర్థులు 16 డివిజన్లలో పోటీలో ఉన్నారు. వీరికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక డివిజన్‌ ఏకగ్రీవం కాగా, అది కాంగ్రెస్‌ ఖాతాలో చేరింది.  

Advertisement
 
Advertisement
Advertisement