14న ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ | EAPSET notification on the 14th | Sakshi
Sakshi News home page

14న ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌

Feb 12 2026 4:03 AM | Updated on Feb 12 2026 4:03 AM

EAPSET notification on the 14th

19 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)కు సంబంధించిన నోటిఫికేషన్‌ ఈనెల 14న విడుదల కానుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులను 19 నుంచి స్వీకరిస్తారు. పరీక్ష కేంద్రాలు, సిలబస్‌పై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు సెట్‌కు దరఖాస్తు చేస్తారు. దీంతో ఇంటర్‌ హాల్‌టికెట్ల నంబర్ల ద్వారా పూర్తి డేటా తీసుకుంటారు. 

దీన్ని దృష్టిలో ఉంచుకుని సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌ రెడ్డి బుధవారం ఇంటర్‌ బోర్డు అధికారులతో మాట్లాడారు. నోటిఫికేషన్‌ను దృష్టిలో ఉంచుకుని హాల్‌టికెట్లు పూర్తి డేటాతో ఆన్‌లైన్‌లో ఉంచాలని కోరారు. ఈసారి బాలికలకు దగ్గర్లోనే పరీక్ష కేంద్రాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సెట్‌ అధికారులు తెలిపారు. ముందస్తుగా దరఖాస్తు చేసే వారికి మొదటి ప్రాధాన్యం పరీక్ష కేంద్రాన్ని కేటాయించే వీలుంటుందన్నారు. 

సెట్‌ రాసిన విద్యార్థులు కంప్యూటర్‌ లాగ్‌ ఔట్‌ అవ్వగానే ఎన్ని మార్కులు వచ్చాయనేది తెలుసుకునే వెసులుబాటును తొలిసారిగా కల్పిస్తున్నారు. దీంతో ఏ ర్యాంకు వస్తుందనే అంచనాకు వచ్చే వీలుంది. మరోవైపు వివిధ కాలేజీల్లో గతంలో వచ్చిన కటాఫ్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. కౌన్సెలింగ్‌లో తొలి ప్రాధాన్యం ర్యాంకును బట్టి కాలేజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.  

Advertisement
 
Advertisement
Advertisement