రైతులపై ఎలుగుబంటి దాడి | Bear attack on farmers | Sakshi
Sakshi News home page

రైతులపై ఎలుగుబంటి దాడి

Feb 12 2026 4:14 AM | Updated on Feb 12 2026 4:14 AM

Bear attack on farmers

ఒకరి మృతి, నలుగురి పరిస్థితి విషమం  

బోథ్‌: తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్రకు చెందిన ఒక గ్రామంలో తొమ్మిది మంది రైతులపై ఎలుగుబంటి దాడి చేయడం కలకలం రేపింది. ఇందులో ఒక రైతు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర సరిహద్దులోని బోథ్‌ మండలం నిగిని గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని కిన్వట్‌ తాలూకా దయాళ్‌ ధనోరా గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన దత్త బలిరామ్‌ జాదవ్‌ (55) మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మొక్కజొన్న చేనుకు నీరు పెట్టడానికి వెళ్లాడు. 

ఈ క్రమంలో చేను వద్ద ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా అతనిపై దాడి చేయగా కేకలు వేశాడు. అక్కడే ఉన్న పలువురు రైతులు అక్కడికి చేరుకున్నారు. అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో దత్త బలిరామ్‌ జాదవ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన ఎనిమిది మందిలో రమేశ్‌ బలిరామ్‌ జాదవ్, శంకర్‌ తానాజీ జాదవ్, సుదర్శన్‌ దత్త పవార్, చంద్రసింగ్‌ శేషారావు రాథోడ్‌ తీవ్రంగా గాయపడ్డారు. 

వీరిని చికిత్స నిమిత్తం నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో పరిస్థితి విషమంగా ఉన్న చంద్రసింగ్‌ను మెరుగైన వైద్యం కోసం ఔరంగాబాద్‌కు తరలించారు. వీరితో పాటు పండిట్‌ జైసింగ్‌ జాదవ్, వినోద్‌ శేషారావు రాథోడ్‌ , అరవింద్‌ శేషారావు జాదవ్, సంజయ్‌ దత్తా జాదవ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారికి శివినిలోని పీహెచ్‌సీలో చికిత్స అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement