మాటలతో తేలేలాలేదు.. టీవీఎస్‌ ఆస్తులపై హైకోర్టులో దావా | TVS Group Succession Dispute Lakshmi Venu Moves Madras High Court Asset Partition | Sakshi
Sakshi News home page

మాటలతో తేలేలాలేదు.. టీవీఎస్‌ ఆస్తులపై హైకోర్టులో దావా

Nov 26 2026 2:44 PM | Updated on Nov 26 2026 2:55 PM

TVS Group Succession Dispute Lakshmi Venu Moves Madras High Court Asset Partition

భారతదేశంలోని అత్యంత పురాతన, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకటైన టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ, ఆస్తి పంపకం వివాదం తీవ్రమైన న్యాయ పోరాటంగా మారింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఎమిరిటస్ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు ఉమ్మడి కుటుంబ ఆస్తుల విభజన కోరుతూ మద్రాస్ హైకోర్టులో దావా దాఖలు చేశారు. నవంబర్ 16న ఆమె పంపిన పార్టిషన్ నోటీసుకు స్పందనగా వచ్చిన సమాధానం తన చట్టబద్ధమైన హక్కులను గుర్తించలేదని, చర్చల ద్వారా పరిష్కారం సాధ్యం కాకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె తరఫున విడుదలైన ప్రకటన స్పష్టం చేసింది.

తన సోదరుడు, టీవీఎస్‌ మోటార్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌ వేణుతో సమానంగా తనకు ఆర్థిక యాజమాన్య హక్కులు కల్పించాలని లక్ష్మీ వేణు డిమాండ్‌ చేస్తున్నారు. దశాబ్దాలుగా క్రమశిక్షణకు, ఐక్యతకు మారుపేరుగా నిలిచిన టీవీఎస్‌ వారసత్వ సామ్రాజ్యంలో అంతర్గత విభేదాలు ఇలా బహిరంగంగా నోటీసుల స్థాయికి చేరడం పారిశ్రామిక రంగంలో చర్చనీయాంశమైంది.

ఎవరీ లక్ష్మీ వేణు?

టీవీఎస్‌ గ్రూపు వ్యవస్థాపకులు టి.వి.సుందరం అయ్యంగార్‌కు నాలుగో తరం మునిమనవరాలు లక్ష్మీ వేణు. వేణు శ్రీనివాసన్‌, ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ (టీఏఎఫ్‌ఈ) ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లికా శ్రీనివాసన్‌ల కుమార్తె. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యేల్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పట్టా పొందిన ఆమె యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ వార్విక్‌ నుంచి ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో డాక్టరేట్‌ సాధించారు. కుటుంబ వ్యాపార నిర్వహణలో అనుభవజ్ఞురాలైన లక్ష్మీ ప్రస్తుతం ఆటోమోటివ్‌ విడిభాగాల సంస్థ ‘సుందరం-క్లేటన్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, టీఏఎఫ్‌ఈ వైస్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

వివాదానికి అసలు కారణం ఏమిటి?

2020 నాటి టీవీఎస్‌ కుటుంబ ఒప్పందంతో ఈ విభేదాలు బయటకు వచ్చాయి. అప్పట్లో టీవీఎస్‌ కుటుంబంలోని నాలుగు ప్రధాన శాఖల మధ్య వ్యాపార సంస్థల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇందులో భాగంగా వేణు శ్రీనివాసన్‌ కుటుంబానికి కీలక కంపెనీల నియంత్రణ దక్కింది. ఆ తర్వాత 2024 మార్చి 21న వేణు శ్రీనివాసన్‌ మల్లికా శ్రీనివాసన్‌, లక్ష్మీ వేణు, సుదర్శన్‌ వేణు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2024 ఆగస్టులో లక్ష్మీ టీవీఎస్‌ మోటార్‌ బోర్డు డైరెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్నారు. 2025 ఏప్రిల్‌లో టీవీఎస్‌ మోటార్‌లో 50.26 శాతం వాటా కలిగిన టీవీఎస్‌ హోల్డింగ్స్‌కు బెనిఫిషియల్‌ ఓనర్‌గా సుదర్శన్‌ వేణు పేరు నమోదైంది.

ఇక్కడే అసలు చిక్కుముడి మొదలైంది. 2020 ఒప్పందం కేవలం కుటుంబ శాఖల మధ్య జరిగిన విభజన మాత్రమేనని లక్ష్మీ వేణు చెప్పారు. వేణు శ్రీనివాసన్‌ కుటుంబంలోని నలుగురు సభ్యుల మధ్య ఆస్తుల మదింపు, సమగ్ర ఆర్థిక పంపకం ఎప్పుడూ జరగలేదని ఆమె వాదిస్తున్నారు. 2024 ఎంఓయూ కేవలం వ్యాపార నిర్వహణ బాధ్యతలు, బ్రాండ్‌ వినియోగానికి సంబంధించినదే తప్ప ఆస్తులపై ఉన్న యాజమాన్య హక్కులను తేల్చలేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. పైగా సుమారు రూ.1.83 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన టీవీఎస్‌ మోటార్‌ నియంత్రణ సుదర్శన్‌ చేతిలో ఉండగా రూ.2,400 కోట్ల విలువైన సుందరం-క్లేటన్‌ బాధ్యతలు తనకు అప్పగించడాన్ని ఆర్థిక సమానత్వంగా చూడలేమన్నారు. నిర్వహణ బాధ్యతలు వేరు, ఆస్తి యాజమాన్య హక్కులు వేరని గట్టిగా వాదిస్తున్నారు.

ఏయే సంస్థలపై హక్కులు కోరుతున్నారు?

వేణు శ్రీనివాసన్‌ కుటుంబానికి చెందిన టీవీఎస్‌ ట్రస్ట్‌, ఇతర హోల్డింగ్‌ సంస్థల ద్వారా నిర్వహిస్తున్న ఆస్తుల్లో న్యాయబద్ధమైన వాటాను లక్ష్మీ కోరుతున్నారు. ఇందులో ప్రధానంగా..

టీవీఎస్‌ హోల్డింగ్స్‌: గ్రూపు ప్రధాన హోల్డింగ్‌ సంస్థ.

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ: దేశీయ ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం.

టీవీఎస్‌ క్రెడిట్‌ సర్వీసెస్‌: గ్రూపు ఆర్థిక సేవల విభాగం.

సుందరం-క్లేటన్: ఆటోమోటివ్‌ డై-కాస్టింగ్‌ విడిభాగాల సంస్థ.

చట్టపరంగా లక్ష్మీ వాదనకు ఎంత బలం ఉంది?

లక్ష్మీ వేణు తన నోటీసులో హిందూ వారసత్వ చట్టం-1956 (2005 సవరణ)లోని సెక్షన్‌ 6ను ప్రధాన ఆయుధంగా చేసుకున్నారు. ఈ చట్టం ప్రకారం హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్‌) ఆస్తుల్లో పుట్టుకతోనే కుమారుడితో సమానంగా కుమార్తెకు కూడా సహవారసత్వ హక్కులు ఉంటాయి. 2020లో సుప్రీంకోర్టు వెలువరించిన ‘వినీతా శర్మ వర్సెస్‌ రాకేశ్‌ శర్మ’ తీర్పు కూడా ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో కుమార్తెలకు జన్మత సమాన హక్కులు ఉంటాయని పునరుద్ఘాటించింది. ఏకపక్ష నిర్ణయాలు లేదా కార్పొరేట్‌ ఒప్పందాల ద్వారా కుమార్తెల చట్టబద్ధమైన వారసత్వ హక్కులను హరించలేరని అందులో పేర్కొన్నారు.

అయితే, న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం, వివాదంలో ఉన్న ఆస్తులు నిజంగా ఉమ్మడి కుటుంబ (కోపార్సెనరీ) ఆస్తులా? లేక వేణు శ్రీనివాసన్‌ స్వార్జితమా? ట్రస్ట్‌ల నిబంధనలు ఏం చెబుతున్నాయి? గత ఒప్పందాలకు చట్టబద్ధత ఎంత? అనే అంశాలు కోర్టు విచారణలో కీలకం కానున్నాయి.

కుమార్తెకు అండగా తల్లి మల్లికా శ్రీనివాసన్‌

ఈ వ్యవహారంలో లక్ష్మీ తల్లి మల్లికా శ్రీనివాసన్‌ బహిరంగంగా కుమార్తెకు మద్దతుగా నిలవడం వివాదాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ‘ఒక తల్లిగా నాకు కుమారుడు, కుమార్తె ఇద్దరూ అన్ని విధాలా సమానమే. కుటుంబ ఆస్తుల్లో సుదర్శన్‌కు ఏమాత్రం తీసిపోని న్యాయబద్ధమైన వాటా లక్ష్మీకి చెందాలి’ అని ఆమె స్పష్టం చేశారు. సామరస్యపూర్వక పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని పేర్కొంటూనే ఇప్పటికైనా పారదర్శక చర్చల ద్వారా గౌరవప్రదంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు, టీఏఎఫ్‌ఈ సంస్థ అమాల్గమేషన్స్‌ గ్రూపునకు చెందినదని, దానికి ప్రస్తుత టీవీఎస్‌ ఆస్తుల వివాదంతో సంబంధం లేదని మల్లిక స్పష్టతనిచ్చారు.

ఇదీ చదవండి: బోర్డు మీటింగ్‌లో మొదలై.. హైకోర్టుకు చేరిన పంచాయితీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement