లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ గురువారం తొలి మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘జన్ మన్ కా మేనిఫెస్టో’ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను ‘సత్తాయిస్ కా సంకల్ప్.. పీడీఏ కా ప్రణ్‌పత్ర్’ అనే నినాదంతో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ విడుదల చేశారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, రిజర్వేషన్లు, ఉపాధి, విద్య, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలు, యువత, వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
‘’అచ్చే దిన్ రాలేదు.. బురే దిన్ వెళ్లిపోయే సమయం వచ్చింది. కొంతమంది ఆధిపత్యవాదులు, ఆధిపత్య భావజాలం కలిగినవారు, స్వార్థపరులు వేల ఏళ్లుగా తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో రాజ్యాంగానికి సవరణలు చేయడం, మార్పులు తీసుకురావడమే కాకుండా దాన్ని పూర్తిగా చెరిపివేయాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ప్రేమించే మనమందరం ఒక్కటై, రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న కుట్రలను అడ్డుకోవడాన్ని జాతీయ, సామాజిక బాధ్యతగా స్వీకరించాలి.
మన దేశంలో 'సంవిధాన్' (రాజ్యాంగం) ప్రకారం పాలన ఉంటుంది. కానీ, 'మన్‌విధాన్' (ఇష్టారాజ్యం) ప్రకారం కాదు. కొందరు శక్తులు రాజ్యాంగం ద్వారా కాకుండా ఇష్టారాజ్యం ద్వారా పాలన సాగించాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం రాజ్యాంగం విషయంలో పోరు కొనసాగుతోంది. ఒకవైపు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి అధికారంలోకి రావాలని చూసేవారు ఉన్నారు. మరోవైపు రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయ పాలనను కోరుకుంటున్న పీడీఏ ఉంది. అన్ని రకాల అసమానతలను తొలగించి, రిజర్వేషన్లు, సమానత్వాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం" అని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
తొలి మేనిఫెస్టోలోని హామీలు
మహిళలు, వృద్ధులకు ఏడాదికి రూ.40 వేల ఆర్థిక సాయం
300 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడి
స్వయం ఉపాధి కోసం యువతకు రూ.2 లక్షల ఆర్థిక సాయం, విద్యార్థులకు మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ
పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు కఠిన చట్టం
9వ తరగతి, ఆపై తరగతులు చదువుతున్న బాలికలకు సైకిల్, సోలార్ ల్యాంప్
ఉద్యోగం వచ్చే వరకు పట్టభద్రులకు నెలకు రూ.5,000 చొప్పున భృతి


