కసబ్‌ కేసు ముగిసినా.. న్యాయవాదులకు అందని ఫీజు! | 18 Years after Verdict Ajmal Kasab lawyers still await fees | Sakshi
Sakshi News home page

కసబ్‌ కేసు ముగిసినా.. న్యాయవాదులకు అందని ఫీజు!

Nov 26 2026 1:31 PM | Updated on Nov 26 2026 1:32 PM

18 Years after Verdict Ajmal Kasab lawyers still await fees

ముంబై: దేశాన్ని కుదిపేసిన 26/11 ముంబై ఉగ్రదాడులకు నేటితో 18 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఆ దాడుల్లో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు న్యాయస్థానంలో ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు న్యాయవాదులకు మాత్రం ఇప్పటికీ పారితోషికం అందలేదు. కసబ్‌కు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ దాఖలైన అప్పీలుపై బాంబే హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులు అమీన్ సోల్కర్, ఫర్హానా షా తమకు రావాల్సిన ఫీజుల కోసం ఎదురుచూస్తున్నారు.

2010లో మహారాష్ట్ర ప్రభుత్వం వీరిని కసబ్ తరఫున న్యాయవాదులుగా నియమించింది. 2010 జూన్ 8న మహారాష్ట్ర రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (ఎంఎస్‌ఎల్‌ఏ)ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు సిఫారసు మేరకు వీరి నియామకం జరిగింది. అప్పట్లో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు చెల్లించే స్థాయిలో సోల్కర్‌కు, మరణశిక్ష నిర్ధారణ కేసును వాదించే అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు చెల్లించే స్థాయిలో ఫర్హానా షాకు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించారు.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం వీరికి రోజుకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు పారితోషికం లభించాల్సి ఉంది. అయితే హైకోర్టు విచారణ ముగిసి దశాబ్దానికి పైగా గడిచినా ఒక్క రూపాయి కూడా అందలేదని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ విషయమై పలుమార్లు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించినా సానుకూల స్పందన రావడం లేదని సోల్కర్ తెలిపారనని ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ తన కథనంలో వివరించింది.

పారితోషికం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ కోర్టుకు హాజరైన తేదీలు, ఎన్ని గంటలు వాదనలు వినిపించారనే వివరాలతో కూడిన బిల్లులు సమర్పించాలని అధికారులు కోరుతున్నట్లు న్యాయవాదులు వెల్లడించారు. ఇన్నేళ్ల తర్వాత ప్రతిరోజు కోర్టులో గడిపిన సమయాన్ని కచ్చితంగా గుర్తుచేసుకుని వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ నియామక ఉత్తర్వుల్లోనే పారితోషికం చెల్లింపు విధానం స్పష్టంగా పేర్కొన్నారని, అదే ప్రాతిపదికన బకాయిలు చెల్లించవచ్చని సోల్కర్ ప్రశ్నించారు.

ఈ కేసు విచారణ కోసం తొమ్మిది నెలల పాటు తమ పూర్తి సమయాన్ని కేటాయించామని ఫర్హానా షా తెలిపారు. ఇతర కేసులను పక్కనపెట్టి కసబ్ కేసు విచారణకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకున్నామని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత తమకు పారితోషికం చెల్లిస్తామని నియామక ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. మరోవైపు, న్యాయవాదులు పారితోషికం పొందాలంటే అధికారిక బిల్లులు, మెమోలు సమర్పించడం తప్పనిసరి అని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అధికారి వెల్లడించారు.

కసబ్‌ విచారణ సమయంలో అతడి తరఫున వాదించిన న్యాయవాది అబ్బాస్ కాజ్మీకి మాత్రం ప్రభుత్వం విచారణ పూర్తయిన వెంటనే పారితోషికం చెల్లించింది. ప్రత్యేక న్యాయమూర్తి ఎం.ఎల్. తహలియానీ ఎదుట జరిగిన విచారణలో ఆయన కసబ్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. తనకు ప్రభుత్వం సకాలంలోనే ఫీజు చెల్లించిందని కాజ్మీ తెలిపారు.

కసబ్‌కు విధించిన మరణశిక్ష నిర్ధారణ కేసు, అతడి అప్పీలుపై బాంబే హైకోర్టు 2010 జూన్‌లో విచారణ ప్రారంభించింది. 2011 ఫిబ్రవరిలో ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. అనంతరం సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును ఖరారు చేసింది. ముంబయిలో పట్టుబడిన తర్వాత ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న కసబ్‌ను 2012 నవంబర్ 21న పుణెలోని యెరవాడ కేంద్ర కారాగారంలో ఉరితీశారు.

2008 నవంబర్ 26న పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గంలో ముంబయికి చేరుకున్న లష్కరే తోయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆసుపత్రి తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. నవంబర్ 26 రాత్రి ప్రారంభమైన దాడులు నవంబర్ 29 ఉదయం వరకు దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. ఈ దాడుల్లో విదేశీయులతో సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ముంబయి పోలీసులు, సాయుధ బలగాలు, నేవీ మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) సంయుక్తంగా ఉగ్రవాదులపై చర్యలు చేపట్టి దాడులకు ముగింపు పలికాయి.

ఈ ఘటన తర్వాత దేశంలో తీరప్రాంత భద్రత, నిఘా వ్యవస్థ, భద్రతా విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు కీలక మార్పులు చేపట్టారు. ఉగ్రవాదుల్లో కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుబడి విచారణ ఎదుర్కొని ఉరిశిక్షకు గురయ్యాడు. మరో కుట్రదారుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కుట్రలో మరో నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణాను 2025లో అమెరికా నుంచి భారత్‌కు అప్పగించారు. అయితే ఈ దాడుల వెనుక ఉన్న పలువురు కీలక సూత్రధారులు, సహకరించిన వ్యక్తులు ఇప్పటికీ భారత న్యాయస్థానానికి చిక్కకుండా ఉన్నారని పీటీఐ పేర్కొంది. ప్రతి ఏడాది నవంబర్ 26న ముంబయిలో దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి నివాళులర్పిస్తుంటారు. 

ఇదీ చదవండి: 26/11 ఉగ్రమూకకు పాక్ అండ.. భారత్‌కు దక్కని న్యాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement