ఫ్లకార్డులతో చిత్తూరు–తిరుపతి జాతీయ రోడ్డుపై విదార్థుల నిరసన
ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక.. సొంతంగా ఫీజు కట్టలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఏకంగా పది నిద్ర మాత్రలు మింగి తనువు చాలించాలనుకున్న విద్యార్థిని
సహచర విద్యార్థులు గమనించి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
విద్యార్థుల నిరసనలతో భగ్గుమన్న చిత్తూరు ఎస్వీసెట్ కళాశాల
5 గంటల పాటు చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారి దిగ్బంధం
కాలేజీ గేటు, సెక్యూరిటీ షెడ్డు, లైట్లు ధ్వంసం
స్పెషల్ పార్టీ పోలీసుల రంగ ప్రవేశం.. చెదరగొట్టి ఆందోళనకు చెక్
ప్రభుత్వ పెద్దల సూచనతో బాధిత విద్యార్థినితో మాట్లాడిన కళాశాల యాజమాన్యం
అనారోగ్యం వల్లే ఆత్మహత్యాయత్నం చేశానని బాధిత విద్యార్థినితో చెప్పించిన వైనం
ఈ కళాశాలలో ఫీజుల కోసం నిత్యం వేధిస్తున్నారని విద్యార్థుల ఆగ్రహం
కన్వీనర్ కోటా కింద చేరినా తొలుతే ఫీజు చెల్లించాలని ఆదేశం
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రైవేట్ కాలేజీల్లోనూ ఇదే తంతు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఫీజుల వేధింపులతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడం చిత్తూరు నగర శివారులోని ఎస్వీసెట్ ఇంజినీరింగ్ కళాశాలలో పెను విధ్వంసానికి దారితీసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో యాజమాన్యం తమను పీల్చిపిప్పి చేస్తోందని, అధిక ఫీజులు, అడ్డగోలు జరిమానాలతో వేధిస్తోందని ఆరోపిస్తూ 1,000 మందికి పైగా విద్యార్థులు రోడ్డెక్కారు. సుమారు ఐదు గంటల పాటు చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిని దిగ్బంధించడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
ఎస్వీసెట్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని చిత్తూరు నగరంలోని ప్రైవేటు హాస్టల్ ఉంటోంది. ఆమె బుధవారం రాత్రి నిద్ర మాత్రలు 10 మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. ఈ విషయం గురువారం వెలుగు చూడటంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతులు బహిష్కరించి కాలేజీ గేటు ఎదుట బైఠాయించారు. అరగంట తర్వాత వారంతా ఒక్కసారిగా చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపైకి చేరుకుని వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
విద్యార్థుల నిరసన తీవ్రరూపం
గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చి ఉద్రిక్తంగా మారింది. సహనం కోల్పోయిన విద్యార్థులు కాలేజీ ప్రధాన ఇనుప గేటును తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లారు. కాలేజీ నేమ్‌బోర్డు లైట్లు, సెక్యూరిటీ ఇనుప రేకుల షెడ్డును ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు రంగంలోకి దిగి విద్యార్థులను చెదరగొట్టాయి. అయినా విద్యార్థులు గేటు ఎదుట మళ్లీ నిరసన కొనసాగించారు.
డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తామని చెప్పి.. ఏళ్లు గడుస్తున్నా, ఫీజు బకాయిలు చెల్లించకపోతే తమ గతేంటని నిలదీశారు. కనీసం వసతి దీవెన బకాయిలు సైతం చెల్లించడం లేదని ఎత్తి చూపారు. ఇలాగైతే తాము ఎలా చదవాలని ప్రశ్నించారు.
యాజమాన్యాలేమో.. మొత్తం ఫీజు డబ్బులు ముందే కట్టాలని వేధిస్తున్నాయని, లేదంటే హాల్‌టికెట్లు ఇవ్వకుండా, పాసైన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని వారి కష్టాలు ఏకరువు పెట్టారు. కలెక్టర్ స్వయంగా వచ్చి తమ సమస్యలు వినే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించారు. కాగా, మరో విద్యార్థిని కూడా ఆత్మహత్యాయత్నం చేసిందని విద్యార్థుల్లో చర్చ మొదలైంది. దీనిపై పోలీసులు, కళాశాల యాజమాన్యం అలాంటిదేమీ లేదని స్పష్టం చేయడంతో సాయంత్రం తర్వాత ఆందోళన విరమించారు.
ఫీజుల కోసం నిత్యం వేధింపులు
‘ప్రభుత్వం కట్టాల్సిన ఫీజులు మేము కట్టాలని కన్వీనర్ కోటాలో చేరిన మమ్మల్ని యాజమాన్యం ఇబ్బంది పెడుతోంది. నిత్యం మెసేజ్‌లు పెడుతూ వేధిస్తోంది. కాలేజీ ఫీజులన్నీ కడితేనే పరీక్ష ఫీజు కట్టించుకుంటామంటున్నారు. రూ.3,500 పరీక్ష ఫీజు కట్టడం లేట్ అయితే ఏకంగా రూ.5 వేలు ఫైన్ వేస్తున్నారు. కాండోనేషన్ పేరిట రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు గుంజుతున్నారు. మేం కట్టిన ఫీజులకు కనీసం రశీదులు కూడా ఇవ్వడం లేదు. ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక ఈ ఏడాది ఆరుగురు విద్యార్థులు చనిపోయారు.
మేమంతా పేద కుటుంబాల నుంచి వచ్చాం. కలెక్టర్, జేసీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇక మాకు కూడా ఆత్మహత్యే దిక్కు’ అని పలువురు విద్యార్థులు వాపోయారు. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ.. విద్యార్థులు చెబుతున్నదంతా అవాస్తమని కొట్టిపడేసింది. అనంతరం డీఎస్పీ వెంకటనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్వీసెట్ కళాశాల విద్యార్థిని మౌనిక ఆత్మహత్యాయత్నం చేసింది ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యతో కాదని, ఆమెకు కిడ్నీ సమస్య ఉందని, అనారోగ్యం వల్లే చనిపోవాలనుకుందని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
ఈ కళాశాలలో ఎక్కువగా ఫీజులు, జరిమానాలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు చెబుతుండటంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా.. గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగగానే ఇంటెలిజెన్స్ వర్గాలు విషయాన్ని ప్రభుత్వ పెద్దల చెవిలో వేసినట్లు తెలిసింది. ఆపై కొందరు ఉన్నతాధికారుల సూచనతో కళాశాల యాజమాన్యం బాధిత విద్యార్థినితో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అనారోగ్యం వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేశానని ఆ విద్యార్థిని వెల్లడించడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు, కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేసి, బాధిత బాలికను బెదిరించారని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


