కృష్ణా జిల్లా: 20 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు హనుమాన్ జంక్షన్ వద్ద చేపట్టిన ఆందోళను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల నిరసనలో పాల్గొన్న వల్లభనేని వంశీ.. పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకొస్తున్నారని విమర్శించారు.
‘పరిషత్ ఎన్నికల్లో మా అభ్యర్థులను బెదిరించారు. కేసుల పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులను మళ్లీ వేధిస్తున్నారు. పీఎస్‌లో అడిగితే ఎవరినీ తీసుకురాలేదని బుకాయిస్తున్నారు. పోలీసుల తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉన్నవారిని కూడా బెదిరించారు. వైఎస్సార్‌సీపీ నేతలను అసభ్య పదజాలంతో బూతులు తిడుతున్నారు. కేసుల పేరుతో వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత నక్కా గాంధీ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేరని చెబితే ఆయన భార్యను పోలీసులు ఫోటోలు తీయబోయారు
మహిళ అనే గౌరవం కూడా లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు, చీఫ్ ఏజెంట్‌గా ఉన్న దళిత సర్పంచ్ కిరణ్‌ను ఇష్టానుసారంగా దూషించారు. వైఎస్సార్‌సీపీ నేతల పట్ల పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి కేసు లేకపోయినప్పటికీ స్టేషన్‌కు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు
నేను పోలీస్ స్టేషన్‌కు వచ్చి అడిగితే మేం ఎవరినీ తీసుకురాలేదని పోలీసులు తప్పించుకుంటున్నారు. ఏదైనా ఇష్యూ ఉంటే నోటీసులు ఇవ్వండి సమాధానం చెబుతాం. పోలీసుల తీరుపై ఎస్పీతో పాటు పైఅధికారుల దృష్టికి తీసుకెళతాం. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వేధింపులకు గురికాకుండా కాపాడుకుంటాం’ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: జనసేన మూకల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు


