వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన రాజేశ్వరమ్మ చిత్రంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కె.సంజీవయ్య తదితరులు
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన షేక్ ఫాతిమాబీ, నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తంబిరెడ్డి రాజేశ్వరమ్మను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. షేక్ ఫాతిమాబీ, తంబిరెడ్డి రాజేశ్వరమ్మ గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
నందికొట్కూరు, నాయుడుపేటలలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు, ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన అరాచకాలను వివరించారు. అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మున్సిపల్ చైర్‌పర్సన్లుగా ఎన్నికైన ఫాతిమాబీ, రాజేశ్వరమ్మను వైఎస్ జగన్ అభినందించారు. ప్రజలకు చేరువై నిత్యం వారితో మమేకమవుతూ, వారి కష్టాలు తీర్చేందుకు పని చేయాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి సూచించారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.సంజీవయ్య, రాజేశ్వరమ్మ భర్త తంబిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యరెడ్డి, నాయుడుపేట అధ్యక్షుడు కె.మాధవరెడ్డి, రూరల్ అధ్యక్షుడు కిషోర్‌యాదవ్, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, డాక్టర్ సుధీర్‌తోపాటు షేక్ ఫాతిమాబీ భర్త, పార్టీ నందికొట్కూరు పట్టణ అధ్యక్షుడు మన్సూర్ అహ్మద్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ గఫార్ కూడా వైఎస్ జగన్‌ను కలిసినవారిలో ఉన్నారు.
వైఎస్ జగన్‌ను కలిసిన ‘అల్లూరి’ జిల్లా నాయకులు
ఏఎస్‌ఆర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వంతల శాంతి ఎంపిక
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం అల్లూరి సీతారామరాజు(ఏఎస్‌ఆర్) జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కలిశారు. ఏఎస్‌ఆర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పెదబయలు జెడ్పీటీసీ సభ్యురాలు వంతల శాంతి (ఎస్టీ కోదు సామాజికవర్గం), వైస్ చైర్‌పర్సన్‌గా పాడేరు జెడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు (కొండదొర సామాజికవర్గం)ను అధికారికంగా వైఎస్ జగన్ ప్రకటించారు.

అన్ని సామాజికవర్గాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో వీరిని ఎంపిక చేసినట్లు వైఎస్సార్‌సీపీ అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వెల్లడించారు. వైఎస్ జగన్‌ను కలిసినవారిలో వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, ఎం.విశ్వేశ్వరరాజు, వంతల శాంతి, సీదరి రాంబాబు తదితరులు ఉన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రముఖ డాక్టర్ కాద వెంకటరమణ కుటుంబం
కాకినాడ మేయర్ బరిలో ఆయన సతీమణి సత్యశ్రీ
సాక్షి,అమరావతి: కాకినాడకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కాద వెంకటరమణ తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటరమణ సతీమణి సత్యశ్రీ వైఎస్సార్‌సీపీ తరఫున కాకినాడ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వారు వైఎస్సార్‌సీపీలో చేరగా, పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


