breaking news
Rajeshwaramma
-
కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తన మనవడిని చంపేస్తారని భయంతో కాళ్లుపట్టుకున్నా కనికరించలేదని శ్రీనివాసులు రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పవన్ కళ్యాణ్‌ని పిచ్చిగా అభిమానించిన తన సోదరుడిని హత్యచేశారని తెలిసినా జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని రాయుడు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాయుడి హత్య విషయంపై తమకు న్యాయం చేయాలని కీర్తితోపాటు ఆమె అమ్మమ్మ రాజేశ్వరమ్మ గురువారం శ్రీకాళహస్తి డీఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జనసేన మాజీ ఇన్చార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడి హత్య కేసును ఏపీకి బదిలీచేస్తే కేసు నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయుడు హత్య కేసును ఏపీకి బదిలీ చేయాలని కుట్రలు చేస్తున్నారని, తమిళనాడు పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగాలంటే తమిళనాడు పోలీసులు విచారణ జరపాలని అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. రాయుడిని చంపిన వారిని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన అభిమాని, జనసేన కార్యకర్త హత్యకు గురైతే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పరామర్శ లేదని, ఫోన్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బొజ్జల అనుచరుడు మోసం చేశాడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు పేట చంద్రతో తన మనవడు ఫోన్ టచ్‌లో ఉన్నాడని రాజేశ్వరమ్మ వెల్లడించారు. వినుత సమాచారం, వీడియోలు పంపిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించారని విమర్శించారు. పేట చంద్ర ద్వారా తన మనవడితో మాట్లాడిన సంభాషణలు, చాటింగ్ మెసేజ్‌లు ఉన్నాయని, తాను దొరికిపోయాను అని ఎమ్మెల్యే అనుచరుడు చంద్రకు రాయుడు మెసేజ్ చేస్తే ‘‘నీ చావు నువ్వు చావు, మా పేర్లు చెప్పొద్దు’’ అని మెసేజ్ పెట్టినట్లు కన్నీరుపెట్టుకున్నారు. రాయుడిని చంపక ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగిందని, మనవడిని చంపొద్దు అని వినుత దంపతుల కాళ్ళు పట్టుకుని బతిమిలాడానని, అయినా కనికరం చూపలేదని రాజేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంపేస్తారని తెలిసి వినుత ఇంటి నుంచి దూకి పారిపోయేందుకు రాయుడు యత్నించడం వల్ల అతడి కాళ్లు విరిగాయని, అది సీసీ ఫుటేజీలో రికార్డు అయిందని, ఆ తరువాత రాయుడిని పక్కనే కూర్చొని పెట్టుకుని వినుత దంపతులు తనతో మాట్లాడారని రాజేశ్వరమ్మ చెప్పారు. ఎక్కడికి పారిపోకుండా ఇద్దరితో కలిసి వినుత దంపతులు రాయుడిని నిర్బంధించి కాళ్లు, చేతులు కట్టి కూర్చోబెట్టారని విమర్శించారు. రాయుడికి డబ్బులు ఇచ్చారని చెబుతున్నారని, ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలని డిమాండ్ చేశారు.పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలితనకు అన్న లేకుండా చేశారని సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలకు స్పందించే పవన్ కళ్యాణ్ ఇంత జరిగినా కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్ రావాలి, తమకు న్యాయం చేయాలని కీర్తి డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. రాయుడి హత్య తరువాత తమకు రూ.30 లక్షలు ఆఫర్ ఇచ్చారని, తాము డబ్బుకు లొంగేవాళ్లం కాదని, తమకు న్యాయం జరగాలని డిమాండ్‌చేశారు. సోషల్ మీడియాలో రాయుడిపై ఏవో విష ప్రచారం చేస్తున్నారని, ఈ కేసులో చాలామంది ఉన్నారని, వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.రాయుడు హత్యలో నా ప్రమేయం లేదుశ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితిరుమల: రాయుడి హత్య వెనుక తన ప్రమేయం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాయుడు హత్య, వినుత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కోణంలో తనపై అబాంఢాలు వేస్తున్నారన్నారు. -
మృత్యువులోనూ.. వీడని బంధం
ఏడడుగుల బంధం ‘చివరి’దాకా సాగింది. వారి అన్యోన్య దాంపత్యం చూసి విధికి కన్ను కుట్టింది. దారిలో మాటు వేసి కబళించింది. బంధువుల పెళ్లికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ దుర్మరణం చెందారు. బైక్‌పై వస్తున్న వీరిని ఎదురుగా వస్తున్న క్రూజర్ ఢీకొట్టింది. ఆదివారం సాయంత్రం మండలంలోని గోపవరం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో ఐదునిమిషాల్లో ఇంటికి చేరుతారనగా చోటుచేసుకున్న ఘటన బాధిత కుటుంబంలో విషాదంనింపింది. - న్యూస్‌లైన్, మహానంది శిరివెళ్ల మండలం గంగవరం గ్రామానికి చెందిన బోయ రొడ్డ పెద్ద జయరాముడు(30), రాజేశ్వరమ్మ (రాధమ్మ) ఇద్దరు దంపతులు. జయరాముడు పొలం పనులు చేసేవారు. రాజేశ్వరమ్మ సాక్షర్‌భారత్ గ్రామ కో ఆర్డినేటర్‌గా పనిచేసేవారు. వీరికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు శివనందిని మూడో తరగతి, చిన్న కూతురు శివచరిత యూకేజీ చదువుతున్నారు. పిల్లలకు వేసవి సెలవులు ఉండటంతో రాజేశ్వరమ్మ స్వగ్రామమైన నంద్యాల మండలం కొత్తపల్లెలోని అమ్మమ్మ వద్దకు పంపారు. ఈ క్రమంలో దంపతలిద్దరూ జయరాముడి చిన్నాన్న కుమారుడి పెళ్లికి నెలరోజుల ముందే గత నెల 12న దీబగుంట్లకు వెళ్లారు. పెళ్లి చూసుకుని అక్కడి బంధువులతో సరదాగా మాట్లాడి కుమార్తెలను పలకరించి సాయంత్రం తిరిగి బైక్‌పై గ్రామానికి ప్రయాణమయ్యారు. ఆ ఆనంద క్షణాలు వారికి కొద్దిసేపు కూడా ఉండలేదు. బైక్ గోపవరం సమీపంలోని శ్రద్ద రూరల్ ఫార్మర్స్ వేర్‌హౌస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మహారాష్ట్రకు చెందిన ట్రాక్స్క్రూజర్ వాహనం (ఎంహెచ్ 16ఏటీ1294) ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. కొత్తపల్లె, గంగవరం గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటన స్థలానికి తరలివచ్చి కంటతడిపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు: జయరాముడి తల్లిదండ్రులు పద్మావతి, ఆంజనేయులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికి పెళ్లిళ్లు చేశారు. కుమారులు, కోడళ్లంతా అత్తమామలతో కలిసి ఉమ్మడికుటుంబంగా ఉంటున్నారు. తల్లిదండ్రులంటే జయరాముడికి ప్రాణం. దీంతో ప్రమాద విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరూ సంఘటనా స్థలానికి చేరుకుని రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. నా బంగారు కొడుకు ఎక్కడమ్మా...ఇంకెక్కడ ఉన్నాడమ్మా...అంటూ తల్లి పద్మావతి రోదిస్తూ సొమ్మసిల్లిపడిపోయింది.