కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు | Rajeshwaramma on Srinivasulu Rayudu incident | Sakshi
Sakshi News home page

కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు

Jul 18 2025 4:59 AM | Updated on Jul 18 2025 7:01 AM

Rajeshwaramma on Srinivasulu Rayudu incident

తనను చంపేస్తున్నారని టీడీపీ నేతకు రాయుడు మెసేజ్‌ పెట్టాడు

పవన్‌ కళ్యాణ్‌ స్పందించకపోవడం బాధాకరం

ఏపీకి బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది

కన్నీరుమున్నీరవుతున్న రాయుడు అమ్మమ్మ, సోదరి

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తన మనవడిని చంపే­స్తారని భయంతో కాళ్లుపట్టుకున్నా కనికరించలేదని శ్రీనివాసులు రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పవన్‌ కళ్యాణ్‌ని పిచ్చిగా అభిమానించిన తన సోదరుడిని హత్యచేశారని తెలిసినా జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని రాయుడు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాయుడి హత్య విషయంపై తమకు న్యాయం చేయాలని కీర్తితోపాటు ఆమె అమ్మమ్మ రాజేశ్వరమ్మ గురువారం శ్రీకాళహస్తి డీఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా వారు మీడి­యాతో మాట్లాడారు. జనసేన మాజీ ఇన్‌చార్జ్‌ కోట వినుత డ్రైవర్‌ రాయుడి హత్య కేసును ఏపీకి బదిలీచేస్తే కేసు నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

రాయుడు హత్య కేసును ఏపీకి బదిలీ చేయాలని కుట్రలు చేస్తున్నారని,  తమిళనాడు పోలీసులే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరగాలంటే తమిళనాడు పోలీసులు విచారణ జరపాలని అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. రాయుడిని చంపిన వారిని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తన అభిమాని, జనసేన కార్యకర్త హత్యకు గురైతే ఇప్పటివరకు పవన్‌ కళ్యాణ్‌ పరామర్శ లేదని, ఫోన్‌ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బొజ్జల అనుచరుడు మోసం చేశాడు 
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి అనుచరుడు పేట చంద్రతో తన మనవడు ఫోన్‌ టచ్‌లో ఉన్నాడని రాజేశ్వరమ్మ వెల్లడించారు. వినుత సమాచారం, వీడియోలు పంపిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించారని విమర్శించారు. పేట చంద్ర ద్వారా తన మనవడితో మాట్లాడిన సంభాషణలు, చాటింగ్‌ మెసేజ్‌లు ఉన్నాయని, తాను దొరికిపోయాను అని ఎమ్మెల్యే అనుచరుడు చంద్రకు రాయుడు మెసేజ్‌ చేస్తే ‘‘నీ చావు నువ్వు చావు, మా పేర్లు చెప్పొద్దు’’ అని మెసేజ్‌ పెట్టినట్లు కన్నీరుపెట్టుకున్నారు. 

రాయుడిని చంపక ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగిందని, మనవడిని చంపొద్దు అని వినుత దంపతుల కాళ్ళు పట్టుకుని బతిమిలాడానని, అయినా కనికరం చూపలేదని రాజేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంపేస్తారని తెలిసి వినుత ఇంటి నుంచి దూకి పారిపోయేందుకు రాయుడు యత్నించడం వల్ల అతడి కాళ్లు విరిగాయని, అది సీసీ ఫుటేజీలో రికార్డు అయిందని, ఆ తరువాత రాయుడిని పక్కనే కూర్చొని పెట్టుకుని వినుత దంపతులు తనతో మాట్లాడారని రాజేశ్వరమ్మ చెప్పారు.

 ఎక్కడికి పారిపోకుండా ఇద్దరితో కలిసి వినుత దంపతులు రాయుడిని నిర్బంధించి కాళ్లు, చేతులు కట్టి కూర్చోబెట్టారని విమర్శించారు. రాయుడికి డబ్బులు ఇచ్చారని చెబుతున్నారని, ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలని డిమాండ్‌ చేశారు.

పవన్‌ రావాలి.. మాకు న్యాయం చేయాలి
తనకు అన్న లేకుండా చేశారని సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలకు స్పందించే పవన్‌ కళ్యాణ్‌ ఇంత జరిగినా కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్‌ రావాలి, తమకు న్యాయం చేయాలని కీర్తి డిమాండ్‌ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.  తమకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. రాయుడి హత్య తరువాత తమకు రూ.30 లక్షలు ఆఫర్‌ ఇచ్చారని, తాము డబ్బుకు లొంగేవాళ్లం కాదని, తమకు న్యాయం జరగాలని డిమాండ్‌చేశారు. సోషల్‌ మీడియాలో రాయుడిపై ఏవో విష ప్రచారం చేస్తున్నారని, ఈ కేసులో చాలామంది ఉన్నారని, వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాయుడు హత్యలో నా ప్రమేయం లేదు
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి
తిరుమల: రాయుడి హత్య వెనుక తన ప్రమేయం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాయుడు హత్య, వినుత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కోణంలో తనపై  అబాంఢాలు వేస్తున్నారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement