
మృత్యువులోనూ.. వీడని బంధం
ఏడడుగుల బంధం ‘చివరి’దాకా సాగింది. వారి అన్యోన్య దాంపత్యం చూసి విధికి కన్ను కుట్టింది. దారిలో మాటు వేసి కబళించింది. బంధువుల పెళ్లికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ దుర్మరణం చెందారు.
ఏడడుగుల బంధం ‘చివరి’దాకా సాగింది. వారి అన్యోన్య దాంపత్యం చూసి విధికి కన్ను కుట్టింది. దారిలో మాటు వేసి కబళించింది. బంధువుల పెళ్లికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ దుర్మరణం చెందారు. బైక్‌పై వస్తున్న వీరిని ఎదురుగా వస్తున్న క్రూజర్ ఢీకొట్టింది. ఆదివారం సాయంత్రం మండలంలోని గోపవరం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో ఐదునిమిషాల్లో ఇంటికి చేరుతారనగా చోటుచేసుకున్న ఘటన బాధిత కుటుంబంలో విషాదంనింపింది. - న్యూస్‌లైన్, మహానంది
శిరివెళ్ల మండలం గంగవరం గ్రామానికి చెందిన బోయ రొడ్డ పెద్ద జయరాముడు(30), రాజేశ్వరమ్మ (రాధమ్మ) ఇద్దరు దంపతులు. జయరాముడు పొలం పనులు చేసేవారు. రాజేశ్వరమ్మ సాక్షర్‌భారత్ గ్రామ కో ఆర్డినేటర్‌గా పనిచేసేవారు. వీరికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు శివనందిని మూడో తరగతి, చిన్న కూతురు శివచరిత యూకేజీ చదువుతున్నారు. పిల్లలకు వేసవి సెలవులు ఉండటంతో రాజేశ్వరమ్మ స్వగ్రామమైన నంద్యాల మండలం కొత్తపల్లెలోని అమ్మమ్మ వద్దకు పంపారు.
ఈ క్రమంలో దంపతలిద్దరూ జయరాముడి చిన్నాన్న కుమారుడి పెళ్లికి నెలరోజుల ముందే గత నెల 12న దీబగుంట్లకు వెళ్లారు. పెళ్లి చూసుకుని అక్కడి బంధువులతో సరదాగా మాట్లాడి కుమార్తెలను పలకరించి సాయంత్రం తిరిగి బైక్‌పై గ్రామానికి ప్రయాణమయ్యారు. ఆ ఆనంద క్షణాలు వారికి కొద్దిసేపు కూడా ఉండలేదు. బైక్ గోపవరం సమీపంలోని శ్రద్ద రూరల్ ఫార్మర్స్ వేర్‌హౌస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మహారాష్ట్రకు చెందిన ట్రాక్స్‌క్రూజర్ వాహనం (ఎంహెచ్ 16ఏటీ1294) ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. కొత్తపల్లె, గంగవరం గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటన స్థలానికి తరలివచ్చి కంటతడిపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు:
జయరాముడి తల్లిదండ్రులు పద్మావతి, ఆంజనేయులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికి పెళ్లిళ్లు చేశారు. కుమారులు, కోడళ్లంతా అత్తమామలతో కలిసి ఉమ్మడికుటుంబంగా ఉంటున్నారు. తల్లిదండ్రులంటే జయరాముడికి ప్రాణం. దీంతో ప్రమాద విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరూ సంఘటనా స్థలానికి చేరుకుని రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. నా బంగారు కొడుకు ఎక్కడమ్మా...ఇంకెక్కడ ఉన్నాడమ్మా...అంటూ తల్లి పద్మావతి రోదిస్తూ సొమ్మసిల్లిపడిపోయింది.