ఐ–టీడీపీ పైశాచికం.. జనసేన సైకోయిజం | Posts on social media targeting family members of former CM YS Jagan | Sakshi
Sakshi News home page

ఐ–టీడీపీ పైశాచికం.. జనసేన సైకోయిజం

Nov 13 2026 4:39 AM | Updated on Nov 13 2026 4:39 AM

Posts on social media targeting family members of former CM YS Jagan

‘ఎక్స్‌’లో సమావేశం పెట్టుకొని వైఎస్‌ జగన్‌ కుటుంబంపై జుగుప్సాకర దూషణ చేసిన జనసేన మూక వీరే..

కిరాయి మూకలతో సోషల్‌ మీడియాలో జుగుప్సాకర పోస్టులు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులే లక్ష్యంగా రాక్షసత్వం

ప్రత్యేక సమావేశం పెట్టుకుని మరీ విష ప్రచార కుట్ర

సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ చేసేందుకుపక్కా కుతంత్రం

అధిష్టానాల అండతో చెలరేగుతున్న పిశాచ గణాలు

చంద్రబాబు, పవన్‌ తీరు రాష్ట్ర రాజకీయాలను మరింత భ్రష్టు పట్టిస్తుందని హెచ్చరిస్తున్న పరిశీలకులు

సాక్షి, అమరావతి: రాజకీయాల్లో జుగుప్సాకర విష సంస్కృతికి టీడీపీ, జనసేన కూటమి బరి తెగించింది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో దిగజారుడు రాజకీయాలతో కూటమి వెర్రితలలు వేస్తోంది. సోషల్‌ మీడియా వేదికల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచార, వ్యక్తిత్వ హనన కుతంత్రాలకు తెగబడుతోంది. టీడీపీ మొదటి నుంచీ పెంచి పోషించిన సోషల్‌ మీడియా పచ్చ మూకల పైశాచికత్వాన్ని జనసేన కూడా నిలువెల్లా ఒంటబట్టించుకుంది. 

పవనిజం అంటూ చేస్తున్న రాజకీయ రాద్ధాంతం సోషల్‌ మీడియా సైకోయిజంగా మారింది.దీనికి టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ఐ–టీడీపీ వత్తాసు పలుకుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని జనసేన సోషల్‌ మీడియా కార్యకర్తలు, కిరాయి రాజకీయ కూలీలు జుగుప్సాకర పోస్టులు పెడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. వైఎస్‌ జగన్‌ కుటుంబంలోని మహిళలు, చిన్న పిల్లలు అనే కనీస విచక్షణ కూడా లేకుండా అసభ్యకర పోస్టులు పెడుతూ రాక్షసానందం పొందుతుండటం జనసేన వికృత రూపాన్ని బట్టబయలు చేస్తోంది.

బాధ్యతాయుంగా వ్యవహరించిన వైఎస్సార్‌సీపీ 
పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల తన మూడో భార్య అన్నా కొణిదెలకు విడాకులు ఇచ్చారు. ఈమేరకు వారిద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ నిర్ణయం పూర్తిగా పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత అంశం. వైఎస్సార్‌సీపీ అధిష్టానం అదే విషయాన్ని తమ పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు ప్రధానంగా సోషల్‌ మీడియా విభాగానికి స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని.. సోషల్‌ మీడియా వేదికల ద్వారా కూడా స్పందించవద్దని ఆదేశించింది. 

వైఎస్సార్‌ సీపీ నేతలు, శ్రేణులు, సోషల్‌ మీడియా కార్యకర్తలు పార్టీ అధిష్టానం ఆదేశాలను శిరసావహించారు. ఈ వ్యవహారంలో ఓ బాధ్యతాయుత రాజకీయ పార్టీగా వైఎస్సార్‌సీపీ పరిణితితో వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర రాజకీయాల్లో సత్సంప్రదాయానికి వైఎస్సార్‌సీపీ చొరవ చూపిందని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

జనసేన పిశాచాల పైశాచికత్వం...
జనసేన సోషల్‌ మీడియా పిశాచ గణం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జుగుప్సాకరంగా బరి తెగించడం విస్మయపరుస్తోంది. విడాకుల ప్రకటన చేసిన పవన్‌ కళ్యాణ్‌కు సంఘీభావంగా జనసేన సోషల్‌ మీడియా కార్యకర్తలు తాజాగా ఓ జూమ్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలు దాదాపు 350 మంది ఆ సమావేశంలో పాల్గొన్నారు. పవన్‌ కళ్యాణ్‌కు బాసటగా నిలుస్తామని చెప్పేందుకు ఉద్దేశించిన ఆ సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా గాడి తప్పించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు.

ముందుగానే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్న అనంతరమే తమ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలతో జనసేన సమావేశాన్ని నిర్వహించినట్టు స్పష్టమవుతోంది. అప్పటికే రూపొందించిన సోషల్‌ మీడియా పిశాచ గణానికి అందించారు. ఆ వెను వెంటనే ఫేక్‌ ఐడీలతో కూడిన సోషల్‌ మీడియా ఖాతాల నుంచి లెక్కకు మించి అసభ్యకర పోస్టులను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. జనసేన ప్రధాన కార్యాలయం ఆదేశాలు, పర్యవేక్షణ ద్వారానే సోషల్‌ మీడియాలో పక్కా కుతంత్రానికి పాల్పడినట్టు స్పష్టమవుతోంది.

జుగుప్సాకర కుట్రకు ఐ–టీడీపీ వత్తాసు...
టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ఐ–టీడీపీ.. సోషల్‌ మీడియా వేదికగా జుగుప్సాకర పోస్టులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నది బహిరంగ రహస్యమే. అలాంటి రాక్షస గణాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయం 2014 నుంచే పెంచి పోషిస్తూ  వ్యవస్థీకృతం చేసింది. ప్రస్తుతం జనసేన సోషల్‌ మీడియా పిశాచగణం అసభ్యకర పోస్టులను ఐ–టీడీపీ తమ భుజానికెత్తుకుంది. తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా మరింతగా వైరల్‌ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కుటుంబాల్లోనూ మహిళలు, పిల్లలు ఉన్నారు. కానీ వారిద్దరూ తమ పార్టీల సోషల్‌ మీడియా విభాగాల పైశాచికత్వాన్ని అడ్డుకునేందుకు కనీసం యత్నించ లేదు. 

ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షక పాత్ర పోషించారు. తద్వారా జనసేన, టీడీపీ సోషల్‌ మీడియా పిశాచగణాల పైశాచిక పోస్టులకు తమ మద్దతు ఉందని పరోక్షంగా స్పష్టం చేశారు.  చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ వెన్నుదన్నుతోనే టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా విభాగాలు అసభ్యకరపోస్టులతో సోషల్‌ మీడియాలో విషం కక్కుతున్నాయన్నది తేటతెల్లమైంది. దీన్ని పరిశీలకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పవన్, చంద్రబాబు వైఖరి రాష్ట్ర రాజకీయాలను మరింతగా భ్రష్టు పట్టిస్తోందని హెచ్చరిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement